{"uid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1625574622932","source":"other","origin":"gallery"}

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నాంపల్లి కోర్టు 6 నెలల జైలు శిక్ష రూ.వెయ్యి జరిమానా విధించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనను అడ్డుకున్న తెలంగాణ ఉద్యమకారులపై దాడి చేసిన కేసులో శిక్ష పడింది. 2015లో దానం నాగేందర్ మంత్రిగా ఉన్నారు, అది తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయం. మంత్రుల్ని ఉద్యమకారులు అడ్డుకుంటున్న రోజులు. ఆ సమయంలో బంజారాహిల్స్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నాగేందర్ ను ఉద్యమకారులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కానిస్టేబుల్ చేతిలో ఉన్న కర్ర తీసుకుని ఉద్యమకారులపై దాడి చేశారు. ఆ ఘటనలో గాయపడిన ఓ వ్యక్తి పోలీసు కేసు పెట్టారు. దీని విచారణ ఇటీవల ప్రారంభమైంది.

ప్రజాప్రతినిధులపై కేసులను శరవేగంగా తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిన క్రమంలో నాగేందర్ కేసు విచారణ వేగంగా జరిగింది. దీంతో ఆయనకు శిక్ష ఖరారైంది. హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు శిక్షను నెలరోజుల పాటు కోర్టు వాయిదా వేసింది. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఆయన ఏ ఘర్షణలో పాల్గొన్నారో ఇప్పుడు అదే తెలంగాణ ఉద్యమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల పార్టీ మారుతున్నట్లు వచ్చిన ప్రచారం రావడంతో అది వాస్తవం కాదని తన ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్పారు. ఏ దాడి గురించి చెప్పినా నాగేందర్ ఉద్యమకారులపై విరుచుకుపడే ఘటననే గుర్తుకు తెచ్చుకుంటారు. దీంతో దానం నాగేందర్ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళతారో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.