కేరళలోని ఓ ఏనుగు విషాద పరిస్థితుల్లో ఓ నదిలో నిల్చొని చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. కారణం ఆ ఏనుగు తిన్న పైనాపిల్ పేలిపోవడమే. ఆ ఏనుగు బతికివుంటే, త్వరలో మరో గున్న ఏనుగుకు జన్మనిచ్చేదే. కొంతమంది స్థానికులు ఆ ఏనుగుకు నిండా క్రేకర్లు నింపిన పైనాపిల్ నోట్లో పెట్టారు. అవి పేలడంతో ఏనుగు నోట్లో భారీగా పేలుడు సంభవించి అది చనిపోయింది. ఉత్తర కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యంలో పడేసి, ఆవేదన చెందేలా చేస్తోంది. అడవిలో ఉండే ఆ ఏనుగు ఆకలితో, ఆహారం కోసం వెతుక్కుంటూ, దగ్గర్లోని ఓ గ్రామంలోకి వచ్చింది. వీధుల్లో ఏనుగు తిరుగుతుంటే పిల్లలు సంబరపడ్డారు. ఇంతలో కొంతమంది ఆకతాయిలు ఏనుగును భయపెడితే, తిరిగి అడవిలోకి వెళ్లిపోతుందని అనుకొని బాణసంచా తెచ్చారు. ఐతే ఆకతాయిలకు ఓ పిచ్చి ఆలోచన వచ్చింది.

వెంటనే క్రేకర్లను ఓ పైనాపిల్‌లో కుక్కారు. వాటికి నిప్పు పెట్టి, ఏనుగు నోట్లో పెట్టారు. వాళ్లు ఎంత దుర్మార్గంగా చేస్తున్నారో గ్రహించలేకపోయిన ఏనుగు ఆ పైనాపిల్‌ను నోట్లోకి తీసుకుంది. అది భారీగా పేలింది. ఏనుగు పొట్టలో 18 నెలల గున్న ఏనుగు ఉందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పైనాపిల్ పేలుడుకి ఏనుగు నోరు పూర్తిగా నాశనమైందనీ, నాలిక తీవ్రంగా తెబ్బతిందని అధికారులు తెలిపారు. కాలిన నోటితో ఆ ఏనుగు కేకలు పెడుతూ ఊరి సందుల్లో అటూ ఇటూ తిరిగింది. ఏదీ తినలేకపోయింది.

ఆ ఏనుగు ఇప్పటివరకూ ఎవ్వరికీ హాని చెయ్యలేదనీ, చాలా మంచిదని అధికారులు తెలిపారు. గాయాల నొప్పి, బాధతో ఆ ఏనుగు చివరకు వెల్లియార్ నదిలోకి వెళ్లింది. అక్కడ నీరు తాగింది. ఆ తర్వాత నదిలోనే నిల్చొని చనిపోయింది. చనిపోయే ముందు ఆ ఏనుగు నీటిని తాగడం ద్వారా ఆ నొప్పిని తగ్గించుకొని ఉండొచ్చని అంటున్నారు. దానిని తిరిగి అడవికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. జరిగిన ఘటనపై కేరళ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు