అత్యాచారం, హత్యకు గురైన దిశ కుటుంబ సభ్యులను హీరో మంచు మనోజ్‌ పరామర్శించారు. మంగళవారం శంషాబాద్‌లోని దిశ ఇంటికి వెళ్లిన మనోజ్‌ ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. దిశ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ: ఇళ్లలో మగవాళ్లు ఆడవాళ్లపై చేయి చేసుకోవడం మానుకోవాలని సూచించారు. ఇది చెడు సంప్రాదాయానికి దారి తీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దిశ నిందితులకు ఊరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు.

అమ్మాయిలను లవ్‌ చేయండి కానీ ఇబ్బంది పెట్టకండి:

అలాగే ఈ రోజు ఉదయం మనోజ్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో ఓ సందేశాన్ని ఉంచారు. ఆడవాళ్లకు గౌరవం ఇవ్వాలని.. వారిని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఓ కార్యక్రమంలో తాను మాట్లాడిన వీడియోను కూడా మనోజ్‌ పోస్ట్‌ చేశారు.

‘ఇవాల్టి నుంచి మనస్ఫూర్తిగా ఆడవాళ్లందరిని గౌరవిద్దాం. ఈ విషయాన్ని అందరూ తమ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. అమ్మాయిలకు ఐ లవ్యూ చెప్పడంలో తప్పు లేదు. కానీ వారు ఒప్పుకోక పోయినా ఇబ్బంది పెట్టడం తప్పు. అమ్మాయి నచ్చలేదని చెపితే.. థాంక్యూ అమ్మా అని తిరిగి వెళ్లిపోయే వాడే అసలు సిసలైన మగాడు’అని మనోజ్‌ ఆ వీడియోలో పేర్కొన్నారు.