సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపధ్యంలో కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది సైనికులు అమరులైన ఘటన మరువకముందే మరో సైనికుడి సాహసం దేశాన్ని పులకింపచేస్తోంది. చైనా సరిహద్దుల్లో సిక్కిం ముగుతాంగ్ వద్ద విధులు నిర్వహిస్తున్న మన సైన్యానికి చైనా సైనికులు మన భూభాగంలోకి చొరబడినట్లు అర్ధమైంది. వెంటనే బిరోల్ దాస్ అనే యువ సైనికాధికారి భారత్ భూభాగంలోకి ప్రవేశించిన చైనా సైనిక దళాలను అడ్డుకున్నారు. అయితే ఈ భూభాగం తమదేనంటూ ఆ చైనా మేజర్ దురుసుగా సమాధానం చెప్పడంతో బిరోల్ దాస్ చేతితో కొట్టిన దెబ్బకు చైనా మేజర్ పళ్ళు ఊడి కింద పడ్డాడు. దీంతో వెంటనే చైనా సైన్యం పలాయనం చిత్తగించింది. గాయపడ్డ చైనా మేజర్ ను చైనా భూబాగం వద్దకు తీసుకెళ్ళి మన సైనికులే అప్పగించారు. దురుసుగా ప్రవర్తించిన చైనా మేజర్ ను చైనా సైనికాధికారులు అక్కడే తప్పుబట్టారని కూడా సమాచారం. ఆయుధాల విషయంలో చైనా మనకంటే ముందు ఉన్నప్పటికీ సైనికుల ధైర్య సాహసాల్లో సంతోష్ బాబు, బిరోల్ దాస్ వంటి సైనికుల ధైర్యమే దేశానికి రక్షగా వుంటుందని బిరోల్ దాస్ తండ్రి గర్వంగా చెప్పాడు. తన కొడుకు దేశభక్తిని, ధైర్య సాహసాలను తాను పొగడనని, సైనికుడిగా ఆ మాత్రం దేశభక్తి ఉండాల్సిందేనని ఆయన తెలిపారు.