ఓ యువతికి పట్టిన దెయ్యం పొగొడతానంటూ ఓ మత గురువు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే:

మైసూరు జిల్లా చిల్కుంద గ్రామానికి చెందిన యువతి కొంతకాలంగా మానసికంగా ఇబ్బంది పడుతోంది. ఆ యువతికి దెయ్యం పట్టిందని భావించిన బంధువు, సమీపంలోని హణసూరు లాల్‌బన్ బజారుకు చెందిన జబీవుల్లా అనే స్వామిజీ వద్దకు తీసుకొచ్చాడు. సదరు యువతిని మత గురువు పరీక్షించి ఆమెపై మంత్రాలు ప్రయోగించారని, దెయ్యం పట్టిందని పిరియాపట్టణ దర్గా వద్దకు తీసుకొస్తే దెయ్యాన్ని విడిపిస్తానని చెప్పి వెళ్లాడు. దీంతో బంధువు యువతిని ఆ స్వామిజీ చెప్పిన విధంగానే దర్గా వద్దకు తీసుకెళ్లాడు.

అయితే ఈ క్రమంలో యువతి వద్ద ఉంటే నీకూ దెయ్యం పడుతుందని ఆమెను తీసుకొచ్చిన బంధువును మత గురువు దూరంగా పంపించాడు. అనంతరం యువతికి స్నానం చేయాలనే నెపంతో తీసుకెళ్లి జబీవుల్లా ఆమెపై అత్యాచారం చేశాడు. ఊహించని ఈ ఘటనతో యువతి బెదిరిపోయి తన తండ్రికి జరిగినదంతా చెప్పింది. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి జబీవుల్లాను విచారిస్తున్నారు.