తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్‌. తాజాగా విశాల్‌, అతని తండ్రి కరోనా బారినపడ్డారంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి స్పష్టతా రాలేదు. ఈ నేపథ్యంలో విశాల్‌ స్పందించారు. తన తండ్రితో పాటు తానూ కరోనా బారిన పడినట్లు ట్వీట్‌ చేశారు.
‘‘అవును! అది నిజం. కరోనా పరీక్షల్లో మా నాన్నకు పాజిటివ్‌ అని తేలింది. ఆయనకు సహాయకుడిగా ఉన్నందుకు నాకూ కరోనా సోకింది. తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడ్డా. నా మేనేజర్‌కు కూడా ఈ వ్యాధి సోకింది. మేమంతా ఆయుర్వేద ఔషధాలు వాడి కేవలం వారం రోజుల్లో ప్రమాదం నుంచి బయటపడ్డాం. ప్రస్తుతం మేమంతా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నా’’ అని విశాల్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం విశాల్‌ రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ‘డిటెక్టివ్‌2’తో పాటు ‘చక్ర’ అనే సినిమాలోనూ కనిపించనున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ చిత్రాల షూటింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడింది.