సంసారానికి పనికి రాడన్న విషయాన్ని దాచి పెట్టి వివాహం చేసుకోవడంతో పాటు వేధింపులకు పాల్పడుతున్న భర్త, బంధువులపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిగడపకు చెందిన అతడికి 2016లో వివాహం జరిగింది. ఆ సమయంలో భార్య రూ.10 లక్షల కట్నంతో పాటు బంగారం, ఆడపడుచు లాంఛనాలు ఇచ్చింది. వివాహం జరిగిన అనంతరం మొదటి రాత్రి భర్త ఏదో ఒకసాకు చెబుతూ ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. కొన్నాళ్ల తర్వాత భార్య నిలదీయగా తాను సంసారానికి పనికి రానని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానంటూ తెలిపాడు. దీనిపై ఆమె అత్తమామలను ప్రశ్నించగా అప్పటి నుంచి వారు ఈమెను వేధించడం మొదలు పెట్టారు. ఇంకా కట్నం తెస్తేనే ఇంట్లో ఉండనిస్తామంటూ బెదిరించడంతో ఈమె పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె భర్త, అత్త, మామ, ఆడపడుచులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.