విడవలూరు: నూతనంగా వివాహం చేసుకున్న వధువు కత్తి ఉమామహేశ్వరిని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరుకు చెందిన టీడీపీ నాయకుడు సత్యవోలు సత్యంరెడ్డి కిడ్నాప్‌ చేసిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. విడవలూరు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ మహేంద్ర కథనం మేరకు: విడవలూరులోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కత్తి ఉమామహేశ్వరి, అన్నారెడ్డిపాళెం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నలబాయి హరి గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరు మేజర్లు కావడంతో శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి పెంచలకోనలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆదివారం అన్నారెడ్డిపాళెంలోని హరి ఇంటికి చేరుకున్నారు. అదేరోజు రాత్రి విడవలూరుకు చెందిన టీడీపీ నాయకుడు సత్యవోలు సత్యంరెడ్డి దాదాపు 30 మందితో కలిసి ఆటోల్లో అన్నారెడ్డిపాళెంలోని హరి ఇంటికి వెళ్లి వధువు కత్తి ఉమామహేశ్వరిని బలవంతంగా ఆటోలో ఎక్కించే ప్రయత్నం చేశారు.

ఈ సమయంలో ఆమె భర్త హరి అడ్డుపడగా అతన్ని కులం పేరుతో దూషించి పక్కకు తోసి వధువును బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని కిడ్నాప్‌ చేశారని తెలిపారు. నలబాయి హరి ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వధువు తల్లిదండ్రులకు ఈ ప్రేమపెళ్లి ఇష్టం లేదని తెలుస్తోంది. దీంతో పాటు వీరు టీడీపీ సానుభూతిపరులు కావడంతో సత్యంరెడ్డిని సంప్రదించారని, దీంతో వధువును సత్యంరెడ్డి కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం. వధువు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.