హైదరాబాద్ శివారులోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రావణి(20) అనే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. వరకట్న వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమని పుట్టింటివారు ఆరోపిస్తున్నారు. శ్రావణి తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం, ఒంగోలు జిల్లాకు చెందిన శ్రావణికి కీసర సమీపంలోని ఆర్ఎల్ నగర్‌లో ఉండే రామాంజనేయులుతో ఐదు నెలల క్రితం వివాహం జరిగింది. ఆ సమయంలో రూ.5లక్షలు వరకట్నంగా ఇచ్చారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే అదనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి. అత్తింటివారంతా ఆమెను వేధించేవారు. దీంతో తమ బిడ్డను ఏమీ అనవద్దని మరో రూ.5లక్షలు ఇస్తామని శ్రావణి తల్లిదండ్రులు వారికి నచ్చజెప్పారు. ఇదే క్రమంలో గురువారం ఉదయం శ్రావణి-రామాంజనేయులు మధ్య కట్నం విషయమై గొడవ జరిగింది. దీంతో శ్రావణి తీవ్ర మనస్థాపానికి గురై బాత్‌రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తేల్చేశారు. శ్రావణి మెడపై నల్లగా ఉండటంతో ఆమె మృతిపై అనుమానం వ్యక్తమవుతోంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.