అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కూతురు టిఫనీ ట్రంప్‌ను అభినందించారు. జార్జ్‌టౌన్ లా స్కూల్ నుంచి టిఫనీ ట్రంప్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సందర్భంగా ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబం నుంచి తనకు ఒక న్యాయవాది కావాలని, టిఫనీని చూస్తుంటే గర్వంగా ఉందంటూ బుధవారం ట్రంప్ ట్వీట్ చేశారు. కరోనా నేపథ్యంలో జార్జ్‌టౌన్ కాలేజ్, క్లాస్ ఆఫ్ 2020 విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా డిగ్రీలను ప్రదానం చేసి సత్కరించింది.

కాగా, ట్రంప్‌కు మొత్తం ముగ్గురు భార్యలు, ఐదుగురు పిల్లలు. టిఫనీ ట్రంప్ రెండో భార్య మార్ల మేపుల్స్ కూతురు. ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్‌కు ముగ్గురు పిల్లలు కాగా, వారిలో డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు. ఇక ఇవాంకా ట్రంప్ వైట్‌హౌస్ అడ్వైజర్‌గా ఉన్నారు. మూడో భార్య మిలానియా ట్రంప్‌కు జన్మించిన బారన్ ట్రంప్(14) మేరీల్యాండ్‌లో ప్రైవేటు స్కూల్‌లో చదువుకుంటున్నాడు. ఐదుగురు పిల్లల్లో టిఫనీ ఒక్కరే లా కోర్సు చేయడం విశేషం.