తెలంగాణ రాజకీయాల్లో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జోరు పెంచారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. ఐతే తాజాగా కేఏ పాల్‌పై టీఆర్‌ఎస్ నేత, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హాట్ కామెంట్స్ చేశారు. తన భర్త వెంకటాచారిని మభ్యపెట్టి తన పార్టీలోకి చేర్చుకున్నారని ఆరోపించారు. తమ కుటుంబంలో కేఏ పాల్‌ చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. తనకు బీజేపీ నుంచి రాజ్యసభ సీటు ఇప్పిస్తానని మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు. దీనిపై ఆరా తీస్తే అంతా బూటకమని తేలిందన్నారు. అసలు విషయం బయటపడేసరికి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఫైర్ అయ్యారు. తాను రూ.40 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం చేయడం ఏంటని అన్నారు. తాను టీఆర్ఎస్‌లోనే ఉంటానని ఏ పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు. మరోసారి తన కుటుంబంలోకి ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వస్తే కాళ్లు విరగ్గొడుతానని హెచ్చరించారు. వెయ్యి మంది అమరవీరుల కుటుంబాలకు రూ.10లక్షలు, ఇళ్లు నిర్మించి ఇచ్చే పార్టీకి సపోర్ట్ చేస్తానని స్పష్టం చేశారు.

కేఏ పాల్‌పై శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యాఖ్యల వెనుక టీఆర్ఎస్‌ నేతలు ఉన్నారా అన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల తెలంగాణలో జిల్లాల పర్యటన వెళ్లిన ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై టీఆర్ఎస్‌ నేత దాడి చేశారు. దీనిపై అప్పట్లో రాజకీయ దుమారం రేగింది. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని కేఏ పాల్ సైతం ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి టీఆర్‌ఎస్‌, తెలంగాణ ప్రభుత్వమే టార్గెట్‌గా కేఏ పాల్ విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా ఆయనకు చెక్‌ పెట్టేందుకే శంకరమ్మ ద్వారా చెక్‌ పెట్టారని ప్రచారం జరుగుతోంది.