నాకు ఆడవాళ్లంటే ఆసక్తి లేదు. అమెరికాలో నా స్నేహితుడు ఉన్నాడు. నువ్వు అక్కడికి వచ్చాక అతనితో సుఖపడుదువులే. నేను కూడా కలుస్తాను. ముగ్గురం ఎంజాయ్‌ చేద్దాం’ ఇదీ ఓ ఎన్‌ఆర్‌ఐ వరుడి బాగోతం. అరకోటి కట్నంతో, కోటి ఆశలతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన నవవధువుకు ఎదురైన చేదు అనుభవం. కొడుకు సంసారానికి పనికిరాడని తెలిసీ అత్తమామలు తన గొంతు కోశారని తెలిసి ఆ యువతి గుండె పగిలింది. తనకు న్యాయం చేయాలంటూ సోమవారం గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేసింది. స్పందించిన ఎస్పీ.. దిశ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

తొలి రాత్రి అతను ఆరోగ్యం బాగోలేదని బయటకు వెళ్లిపోయాడు. తర్వాత కూడా దగ్గరకు రానివ్వకపోవడంతో అనుమానం వచ్చిన భార్య అతణ్ని నిలదీసింది. తనకు ఆడవాళ్లంటే ఇష్టం లేదని, అమెరికాలో ఒక బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడని భర్త చెప్పాడు. అతని కోసమే పెళ్లి చేసుకున్నానని.. అమెరికా తీసుకువెళ్లిన తర్వాత తన బాయ్‌ఫ్రెండ్‌కు అప్పజెబుతానని, అతనితో సంసారం చేయాలని చెప్పాడు. తానూ అతనితోనే సుఖపడతాననడంతో ఆమె నిర్ఘాంతపోయి.. తననెందుకు మోసం చేశావని నిలదీసింది. కట్నం కోసం పెళ్లి చేసుకోమంటూ అమ్మానాన్నలు బలవంతం చేయడంతో తప్పలేదని చెప్పాడు. దీంతో ఆమె విషయాన్ని అత్తమామలు, ఆడపడుచుల దృష్టికి తీసుకెళ్లింది. ‘వాడు నీతో సంసారం చెయ్యడు.. కావాలంటే నువ్వూ ఒక బాయ్‌ఫ్రెండ్‌ను వెతుక్కో’ అన్నారని బాధితురాలు వాపోయింది. ఇంతలో తన భర్త అమెరికా వెళ్లిపోయాడని, ఫోన్‌ చేస్తుంటే తీయడం లేదని తెలిపింది. తమ కొడుకుతో మాట్లాడాలంటే పుట్టింటికి వెళ్లి మరో రూ.10 లక్షలు తీసుకురా వాలంటూ అత్తింటివాళ్లు గెంటేశారని ఆవేదన చెందింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి కుంగిపోతున్నారని వాపోయింది. తనకు చావే శరణ్యమని. న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. విచారించి న్యాయం జరిగేలా చూస్తామని అర్బన్‌ ఎస్పీ హామీ ఇచ్చారు.