నా భార్యను పుట్టింటికి పంపి తప్పు చేశాను సౌమ్య భర్త రోదన, ఒకే చితిపై నలుగురికీ దహన సంస్కారాలు మంచిర్యాల జిల్లాలో కౌలు రైతు కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదం నింపింది. కాసిపేట మండలం మలకపల్లికి చెందిన జంజిరాల రమేష్ (40), భార్య పద్మ(35), కుమారుడు అక్షయ్ కుమార్ (17), కుమార్తె సౌమ్య(20) తో కలిసి గురువారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. పంట సాగులో నష్టం రావడంతో పాటు కూతురి పెళ్లికి చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గతేడాది మార్చి 12న సౌమ్యను హాజీపూర్‌ మండలం రాపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కు ఇచ్చి రమేష్‌ దంపతులు ఘనంగా వివాహం చేశారు. వారి కొడుకు అక్షయ్‌ స్థానిక ధర్మారావుపేట పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రమేశ్‌ ఈ ఏడాది కొంత భూమిని కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. సాగులో నష్టం రావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. దీనికి తోడు కూతురి పెళ్లికి కూడా భారీగా అప్పు చేశాడు. అన్నీ కలిపి సుమారు రూ.16లక్షల వరకు అప్పులు అయ్యాయి. వాటిని ఎలా తీర్చాలో రమేష్‌కు మార్గం కనిపించలేదు. దీంతో పరువు పోతుందని భావించే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

సౌమ్య ఇటీవల అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చింది. మొదట సౌమ్య, అక్షయ్‌కు ఉరేసి ఆ తర్వాత దంపతులు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం ఉదయం ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో చుట్టు పక్క వాళ్లు వెళ్లి చూసే సరికి తలుపులు తెరిచే ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా నలుగురూ విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న మంచిర్యాల డీసీపీ ఉదయ్‌ కుమార్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. ఆత్మహత్యలకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం నలుగురి మృతదేహాలకు గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే సౌమ్య(20) పెళ్లైన ఏడాదికే తనువు చాలించిన ఘటన అందరినీ కలిచివేసింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆమె మరణాన్ని భర్తతో పాటు బంధువులు తట్టుకోలేకపోతున్నారు. సౌమ్య తనతో ఎంతో అన్యోన్యంగా ఉండేదని, పుట్టింటికి పంపించకుండా ఉన్నా బతికేదంటూ ఆమె భర్త శ్రావణ్‌ కన్నీరుమున్నీరయ్యాడు.