వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న తన భర్తకు విషం పెట్టి చంపేద్దామని భార్య పన్నిన కుట్రను బాధిత భర్త పసిగట్టాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సోమవారం పోలీసు కార్యాలయానికి పరుగులు తీశాడు. గుంటూరు రూరల్‌ ఎస్పీ కార్యాలయంలోని స్పందనలో తన భార్య, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ ఫిర్యాదు చేశాడు. తన అడ్డు తొలగించుకోవడానికి వారిద్దరూ మాట్లాడుకున్న ఫోన్‌ సంభాషణలు, ఏకాంతంగా గడిపినప్పుడు తీసుకున్న అశ్లీల చిత్రాలను పోలీసు అధికారులకు అందించాడు.

స్పందించిన పోలీసు అధికారులు బాధితుడికి న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా బాధితుడు విలేకరులతో తన ఫిర్యాదు వివరాలు తెలిపాడు. సత్తెనపల్లి మండలానికి చెందిన యువకుడు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతితో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. తన భార్య ఇంటిపక్కనే ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం గ్రహించిన భర్త ఆమెను మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. భర్తపై, వారి కుటుంబ సభ్యులపై పోలీసు కేసు పెట్టింది.

బాధితులు ఆ కేసు విషయమై పోలీసుల వద్దకు తిరుగుతున్నారు. ఈ క్రమంలో సదరు గృహిణి తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తితో హైదరాబాద్‌, గుంటూరులోని లాడ్జిల్లో తిరుగుతున్నట్లు బాధితుడు గుర్తించాడు. వారిపై ఒక కన్నేసి ఉంచాడు. తనకున్న పరిచయాలతో తెలివిగా ఆమె వేరే వ్యక్తితో ఏకాంతంగా గడిపిన ఫొటోలు, వీడియోలు, మాట్లాడుకున్న వాయిస్‌ కాల్స్‌ సేకరించాడు. ఈ సంభాషణలో తనను చంపడానికి వారిద్దరూ పన్నిన కుట్ర తెలుసుకున్నాడు. ఈ ఆధారాలు పోలీసులకు ఇచ్చి, వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకున్నాడు.