మిత్రులారా! నా జీవితంలో ఓరోజు జరిగిన ప్రమాదం మంచి పాఠాన్ని నేర్పింది. ఇది అందరికీ ఉపయోగపడుతుందనే భావనతో మీతో పంచుకోవాలని ఈ పోస్ట్ రాస్తున్నాను. నేను గత11 సం.లుగా నా బండితో వచ్చిన హెల్మెట్ ని నిబంధనలు రాకముందు నుంచే రెగ్యులర్ గా వాడుతున్నాను. బండి మీద ఎక్కడికి వెళ్ళినా హెల్మెట్ ఉండాల్సిందే. అంతగా అలవాటైపోయింది. భగవంతుడి దయవల్ల ఇంతవరకు ఎప్పుడూ ఏ ప్రమాదమూ జరగలేదు కానీ, ఒకరోజు చిన్న పనిమీద కోలమూరు వెళ్ళిన నాకు నా హెల్మెట్ వల్ల ప్రాణాపాయం తప్పింది. ముందు వెళుతున్న నామిత్రుడు చిన్నపిల్లవాడు అడ్డురావడంతో సడెన్ బ్రేక్ వేసాడు.

వెనక వున్న నేను కూడా సడెన్ బ్రేక్ వేయడంతో బండి ఇసుకలో స్కిడ్ అయింది. బేలన్స్ తప్పిన నేను బండి మీద నుండి సరాసరి ఆరడుగుల దూరం లో ఉన్న రాయి మొన మీదకి స్విమ్మింగ్ పూల్ లో దూకినట్టుగా వెళ్లి పడ్డాను. నా హెల్మెట్ దెబ్బ తింది కానీ నా ప్రాణం కాపాడింది.ఈ ఘటన చూసిన చుట్టు పక్కల వాళ్ళు నిర్ఘాంత పోయారు. హెల్మెట్ లేకపోయి వుంటే ఏం జరిగి వుండేదో వూహించుకుంటేనే భయం వేస్తోందనీ, మీరు చాలా అదృష్టవంతులని షాక్ లో వున్న నన్ను లేవదీసి మంచి నీళ్ళు పట్టించారు. జరిగింది అర్దం కావడానికి నాకు అయిదు నిమిషాలు పట్టింది. మోకాళ్ళు కొట్టుకపోయాయి. తల పేరలల్ గా వెళ్లి రాయికి కొట్టుకోవడం వల్ల మెడ బెణికింది.

కానీ ఎంత ప్రమాదం తప్పిందో ఊహించుకుంటే భయంతో వణుకొచ్చింది. నా ప్రాణాలను కాపాడిన నా హెల్మెట్ విలువ తెలిసొచ్చింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదనుకున్నాను. కానీ హెల్మెట్ వల్ల ప్రయోజనాలకు సజీవ సాక్ష్యంగా వున్న నేను ఈ విషయం అందరితో పంచుకుంటే కొంతమందయినా జాగ్రత్త పడతారని భావించి ఈ పోస్ట్ రాస్తున్నాను. ఘటన వద్ద వున్న నామిత్రుడు శ్రీ కాంత్, మిమ్మల్ని చూసాక హెల్మెట్ లేకుండా బండి నడపకూడదని నిశ్చయించుకున్నానని చెప్పాడు. మన దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో నూటికి తొంభై అయిదు మరణాలు తలకి తగిలిన గాయం వల్లనే సంభవిస్తున్నాయని ఎక్కడో చదివాను. నా ఏక్సిడెంటే దీనికి రుజువు. నేను ఆ రాయిని గుద్దిన తీరు చూస్తే హెల్మెట్ లేకుంటే ఖచ్చితంగా మరణం సంభవించి వుండేది.

మిత్రులారా మనకోసమే కాకుండా మనకోసం ఎదురు చూసే మన కుటుంబ సభ్యులని కూడా దృష్టిలో ఉంచుకుని, టూవీలర్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించమని చేతులెత్తి మీ అందరినీ ప్రార్థిస్తున్నాను.
(అతను గుద్దుకున్నాయి రాయి, మరియు హెల్మెట్ , ఫోటోలు చూడండి)