తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ పోలీసులను పరుగులు పెట్టించిన యువతి 24గంటలు తిరిగేలోగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తనకు నచ్చిన వాడిని మనువాడింది. విశాఖపట్నంలోని ఆరిలోవ ప్రాంతానికి చెందిన భార్గవికి, విజయనగరం జిల్లా నెలిమర్లకు చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈనెల 27న రాత్రి పెళ్లి జరగాల్సి ఉంది. వివాహం కోసం నెలిమర్లకు బయలుదేరుతుండగా భార్గవి డయల్ 100కు ఫోన్ చేసి తల్లిదండ్రులు తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని, తనను రక్షించాలని వేడుకుంది. దీంతో అక్కడికి పరుగులు పెట్టిన పోలీసులు ఆమెను స్టేషన్ కు తీసుకెళ్లారు. సీన్ పెళ్లి మండపం నుంచి పోలీస్ స్టేషన్ కు చేరింది. ఐతే తల్లిదండ్రులు చూసిన అబ్బాయితో తాళికట్టించుకునేందుకు ఆమె ససేమిరా అంది. ఆమె మేజర్ కావడంతో పెళ్లి నిర్ణయం తనకే వదిలేయాలని పోలీసులు స్పష్టం చేయడంతో తల్లిదండ్రులు వెనుదిరగాల్సి వచ్చింది.

చివరి నిముషంలో పెళ్లి నిలిచిపోవడంతో బంధువులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన భార్గవి తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నందునే పోలీసులకు ఫోన్ చేశానని చెప్పింది. నిన్నటి నుంచి తనకు, మహిళా సంఘం నాయకురాలు కత్తి పద్మకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపించింది. ఇద్దరు ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నామని తాను సంతోషంగా ఉండాలనుకుంటే తల్లిదండ్రులు తనకు ఫోన్ చేయవద్దంది. అంతేకాదు నా బ్రతుకేదో నేను బ్రతుకుతా అని స్పష్టం చేసింది. తల్లిదండ్రులు ఎంతచెప్పినా వినలేదని ఇప్పుడు తన ఇష్టప్రకారం చేస్తున్నాని చెప్పింది. మరోవైపు భార్గవి కుటుంబ సభ్యులు తనపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆమె భర్త తెలిపాడు.

భార్గవి మేజర్ కావడంతో ఆమె ప్రేమించిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశామని మహిళా సంఘం నాయకులారు కత్తి పద్మ అన్నారు. అబ్బాయి గురించి పూర్తిగా విచారణ చేపట్టిన తర్వాతే పెళ్లి చేశామన్నారు. అంతేకాదు అమ్మాయి ఇష్టం తెలుసుకోకుండా తల్లిదండ్రులు తప్పుచేశారని ఇప్పుడు బెదరించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో కాసేపట్లో పెళ్లనగా పెళ్లి కూతురు కనిపించకుండా వెళ్లిపోయింది. తెల్లవారుజాము ముహూర్తం కావడంతో అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి దాటక పెళ్లిమండపం సిద్ధమైంది. భాజాభజంత్రీలు మోగుతున్నాయి. అమ్మాయికి మంగళస్నానం చేయించేందుకు అమ్మాయిని నిద్రలేపేందుకు గదిలోకి వెళ్లి చూడగా షాకింగ్ దృశ్యం కనిపించింది. రాత్రి గుడ్ నైట్ చెప్పి నిద్రపోయిన పెళ్లికూతురు కనిపించలేదు. పెళ్లికూతురు కనిపించడం లేదంటూ అమ్మాయి తల్లిదండ్రులు వరుడి బంధువులకు చెప్పారు. అందరూ కలిసి కల్యాణమండపం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. ఐతే పెళ్లి కూతురు ఓ యువకుడితో వెళ్లిపోయినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.