గణేష్ నిమజ్జన శోభాయాత్ర జిల్లాలో ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ చందన దీప్తి ఐ.పి.యెస్ గారు స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రధాన రహదారులు, కాలనీలలో ఉన్న అన్ని సి.సి..కెమెరాలను సంబంధిత పోలీస్ స్టేషన్ కు అనుసంధానించి శోభాయాత్రను పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నారు. నవరాత్రులు పూర్తి చేసుకొని నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనే గణేష్ మండపాలకు జియో ట్యాగింగ్ చేసిన పోలీస్ అధికారులు అందుకు అనుగుణంగా కేటాయించిన నంబర్ల ద్వారా శోభాయాత్రను పర్యవేక్షించనున్నారు.

ఎక్కడా ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టడంతో పాటు ఏదైనా సంఘటన జరిగితే జిల్లాలోని ఏ ప్రాంతానికైనా కేవలం ఐదు నుండి పది నిమిషాల వ్యవధిలో చేరుకునే విధంగా పెట్రో వాహనాలు, బ్లూ కోట్స్, సంబంధిత పోలీస్ అధికారులను అప్రమత్తం చేసే విధంగా ఆన్ లైన్ విధానం ద్వారా భద్రత పర్యవేక్షించనున్నారు అలాగే కమ్యునల్ సంబంధిత కేసులలో ఉన్న వారిని బైండోవర్లు చేశామని, రౌడీ షీటర్లతో పాటు క్రిమినల్ రికార్డు ఉన్న వారి కదలికలపై నిఘా పెట్టమని చెప్పారు. గణేష్ మండపాల నిర్వహకులంతా మంచి కండిషన్ లో ఉన్న వాహనాలను మాత్రమే శోభాయాత్రకు వినియోగించాలని సూచించారు. ఆధ్యాత్మిక వాతావరణం చక్కగా కనిపించే విధంగా చూడాలని, మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొనవద్దని చెప్పారు. అలాగే మండపాల నిర్వాహకులు చిన్నారులను నిమజ్జన ప్రాంతాలకు తీసుకురావద్దని సూచించారు. నిర్దేశించిన విదంగా క్రమపద్ధతిలో శోభాయాత్రలో పాల్గొనాలని పోలీస్ శాఖ సూచనలు పాటించాలని కోరారు.

సిసి కెమెరాల పర్యవేక్షణలో శోభా యాత్ర బందోబస్తు నిర్వహిస్తున్నామని, రెవెన్యూ, మున్సిపల్, ఆర్ అండ్ బి, జాతీయ రహదారులు, ఇరిగేషన్ అధికారులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన చోటు చేసుకోకుండా గణేష్ నిమజ్జనం జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. శోభయాత్ర సందర్భంగా జిల్లాలోని అన్ని వైన్ షాపులను మూసి వేయించడం జరిగిందని, ఎవరైనా నిబంధనలు పాటించకపోయినా, శోభాయాత్రలో డి.జె.లు వినియోగించవద్దని , అలాగే ఊరేగింపు సమయంలో విద్యుత్ తీగలు దారిలో అడ్డుగా ఉన్న స్థలాల్లో కర్రలతో వాటిని జరిపే సమయంలో విద్యుత్ షాక్ కు గురయ్యే అవకాశం ఉంది కావున జాగ్రత్త వహించగలరు,

అలాగే ఇతర వర్గాలను గాని మతాలు గాని వ్యక్తులను గాని లక్ష్యంగా చేసుకుని నినాదాలు చేయరాదని, ఇతర మతస్తుల ప్రార్ధనా స్థలాల వద్ద ఆగి ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నినాదాలు చేయరాదని, మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో ఊరేగింపులో పాల్గొనరాదని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించరాదని, రద్దీ ప్రదేశాల్లో చిన్నపిల్లలను వంటరిగా వదిలి వేయరాదని, వారిని ఎప్పటికీ తమ వద్దనే చేత్తో పట్టుకొని ఉంచుకోగలరని, శాంతి బద్రతలో బాగంగా ఎవ్వరు అయిన విఘాతం కల్గిస్తే చట్టం తనపని తాను చేసుకు పోవుటకు సిద్దంగా ఉంటుందిని, కావున అప్రమత్తంగా ఉండగలరని, జిల్లాలో శోభా యాత్ర ప్రశాంతంగా నిర్వహించుకునేలా ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉత్సవ కమిటీల సభ్యులు, శాంతి సంఘం సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని మతాల పెద్దలతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి తగిన సూచనలు చేయడం జరిగిందని వివరించారు.