మరదలిపై అనుమానంతో ఆమె బావే హత్య చేసిన ఘటన నగరంలోని కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: శ్రీకాకుళం జిల్లాకు చెందిన సోమేశ్వరరావు మూసాపేటలో కుటుంబంతో కలిసి ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సోమేశ్వరావు కుమార్తె మంజుల(19) ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన భూపతిజైపాల్(21) బీటెక్ సెకండియర్ వరకూ చదివి మధ్యలోనే చదువు ఆపేశాడు. కూకట్‌పల్లిలో నివాసముంటున్న భూపతి ఖాళీగానే ఉండేవాడు. అయితే, భూపతికి మంజుల వరుసకు మరదలవుతుంది. ఇద్దరూ ఒకరికొకరు తెలిసిన వారే కావడంతో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని కూడా భావించారు. మంజులపై అతి ప్రేమతో పాటు అనుమానం కూడా పెంచుకున్న భూపతి కొన్ని నెలలుగా ఆమెను అనుమానిస్తున్నాడు. ఆ క్రమంలోనే వేరే యువకుడితో మంజుల మాట్లాడటం, చనువుగా ఉండటాన్ని భూపతి గమనించాడు. ఈ విషయంలో మంజులకు, భూపతికి మధ్య వాగ్వాదం నడిచింది. ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ గొడవలు నడుస్తుండగానే ఏప్రిల్ 10వ తేదీన భూపతి తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లడంతో మంజులకు భూపతి కాల్ చేశాడు. ‘నీతో మాట్లాడాలి ఇంటికి రా’ అని చెప్పాడు. మంజుల భూపతి ఇంటికి వెళ్లింది. కొద్దిసేపు ఇద్దరూ బాగానే మాట్లాడుకున్నారు.

మాటల సందర్భంలో మంజులపై ఉన్న అనుమానాన్ని భూపతి మరోసారి బయటపెట్టాడు. దీంతో.. మంజులకు కోపమొచ్చింది. ఇద్దరూ గొడవపడ్డారు. అదే సమయంలో.. భూపతి ఎవరినైతే అనుమానిస్తున్నాడో అతని నుంచే మంజులకు కాల్ వచ్చింది. అది గమనించిన భూపతి మంజులపై పట్టరాని కోపంతో ఊగిపోయాడు. క్షణికావేశంలో మంజుల గొంతు నులిమి ఊపిరాడకుండా చేశాడు. కొద్దిసేపటికి మంజుల ఊపిరాడక చనిపోయింది. మంజుల మృతదేహాన్ని ఇంట్లోని నీటి సంపులో పడేశాడు. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మంజులను హత్య చేసిన భూపతి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయేందుకు ప్రయత్నించి వెనక్కి తగ్గాడు.

శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన భూపతి రాత్రి వరకూ ఎక్కడెక్కడో తిరిగాడు. ఆ తర్వాత మంజులను హత్య చేసినట్లు అంగీకరించి పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగింది చెప్పి లొంగిపోయాడు. పోలీసులు భూపతి ఇంటికి వెళ్లి మంజుల మృతదేహాన్ని సంపులో నుంచి బయటకు తీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిర్వహించి ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. భూపతిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మంజులకు కాల్ చేసిన యువకుడు ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరదలిపై భూపతి పెంచుకున్న అనుమానం మంజుల నిండు ప్రాణాన్ని బలిగొంది.