హైదరాబాద్ : మంచినీటి కోసం వెళ్లిన బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ట్యాంకర్ డ్రైవర్‌ను నగరంలోని మాదాపూర్ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం: మాదాపూర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్న బాలిక (15) మంచినీటి కోసం బస్తీలోని ట్యాంకర్ వద్దకు వెళ్లింది. అయితే ట్యాంకర్ డ్రైవర్ కొంతకాలంగా బాలికతో సన్నిహితంగా ఉంటున్నాడు. నెల క్రితం చెల్లితో కలిసి మంచినీటి కోసం వెళ్లిన బాలికను ట్యాంకర్ డ్రైవర్ రవి పక్కన ఉన్న ఆఫీసులోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయం బాలిక తల్లితో తెలుపగా ఆమె ట్యాంకర్ డ్రైవర్‌ను నిలదీసింది. దీంతో రవి అక్కడి నుంచి పరారీ కావడంతో కుటుంబ సభ్యులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు రవిని గురువారం అరెస్ట్‌ చేశారు.