అత్యధిక వైరస్‌ తీవ్రత ఉన్న అమెరికాలో జులై నెలలో అత్యధికంగా 19లక్షల 4వేల కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఆగస్టు నెలలోనే రికార్డుస్థాయిలో 19లక్షల 50వేల కేసులు బయటపడ్డాయి. మరణాలు మాత్రం అమెరికా, బ్రెజిల్‌ దేశాల్లో ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఆగస్టు నెలలో అమెరికాలో 31వేల కొవిడ్‌ మరణాలు నమోదుకాగా బ్రెజిల్‌లో దాదాపు 30వేల మరణాలు చోటుచేసుకున్నాయి. భారత్‌లో ఈ సంఖ్య దాదాపు 28వేలుగా ఉంది. భారత్ లో ప్రతినెల రెట్టింపుస్థాయిలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. కేవలం ఆగస్టు నెలలోనే దేశవ్యాప్తంగా దాదాపు 20లక్షల కేసులు నమోదయ్యాయి. ఒకే నెల వ్యవధిలో ఇన్ని కేసులు ప్రపంచంలో ఏ దేశంలోనూ నమోదుకాలేదు.

గడిచిన 24గంటల్లో 69,921 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. గత నాలుగురోజులతో పోల్చితే కేసుల సంఖ్య కాస్త తగ్గింది. దీంతో మంగళవారంనాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 36లక్షల 91వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 28లక్షల 39వేల మంది కోలుకోగా మరో 7లక్షల 85వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న మరో 65వేల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76శాతం దాటింది. గడిచిన ఆరు రోజుల తర్వాత మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. నిన్న దేశవ్యాప్తంగా 819 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు . దీంతో మంగళవారం నాటికి దేశంలో కొవిడ్‌ మృతుల సంఖ్య 65,288కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో కరోనా మరణాల రేటు 1.7శాతంగా కొనసాగుతోంది.