జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలంలోని పోతారంలో ఓ యువకుడు ప్రేమించి మోసగించాడని సూసైడ్‌ నోట్‌ రాసి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన కొత్తపల్లి లక్ష్మి, సత్తయ్యలకు నలుగురు కుమార్తెలు. ముగ్గురికి వివాహం కాగా నాలుగో కుమార్తె ఉమ ఇంటర్‌ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన మడ్డి రంజిత్‌, ఉమ ఇంటర్‌ నుంచి ప్రేమించుకుంటున్నారు. ఉమకు ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తుంటే రంజిత్‌ను ప్రేమించానని, అతనినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. సరే అన్న ఉమ కుటుంబ సభ్యులు, రంజిత్‌ను రెండేళ్లుగా వివాహం చేసుకోవాల్సిందిగా అడుగుతున్నారు. యువకుడు మాత్రం వారి మాటలను దాటవేస్తున్నాడు. వేరే సంబంధాలను చూస్తే చెడగొడుతూ, చేసుకుంటే నన్నే చేసుకోవాలని, లేకుంటే చనిపోవాలంటూ ఆమెను బెదిరించసాగాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

సూసైడ్​ నోట్:

మనస్థాపం చెందిన ఉమ ఈ నెల 20న రాత్రి ఇంటి వెనక గుడిసెలో పురుగుల మందు తాగింది. అనంతరం ఇంట్లోకి వచ్చి వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను తొలుత జగిత్యాలకు, అనంతరం కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా బుధవారం మృతి చెందింది. ఉమ అక్కలు ఇంటికి వచ్చి వెతకగా ఉమ రాసిన సూసైడ్‌ నోట్‌ దొరకడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. నాకు పెళ్లి అయినా వాడు నన్ను హ్యాపీగా ఉండనివ్వడు. అందుకే నేను బతికి మీకు బాధను ఇవ్వడం తప్ప నా నుంచి మీకు జరిగే మంచి ఏమీ లేదు. నేను మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నా, గుడ్‌బై ఆల్‌ మై ప్యామిలీ మెంబర్స్‌, మిస్‌యూ మై ప్యామిలీ, మిస్‌యూ మమ్మీ, డాడీ అంటూ లేఖలో పేర్కొంది. ప్రేమించి మోసగించిన రంజిత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రాజయ్య వివరించారు.