‌బ్యాటింగ్‌లో, వికెట్ కీపింగ్‌లో తనదైన ముద్ర వేసిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ సారా టేలర్ న్యూడ్ ఫోటో షూట్‌తో ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. నగ్నంగా వికెట్ కీపింగ్ చేస్తున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ న్యూడ్ ఫోటోషూట్ ఏదో సరదాకి చేసింది కాదంటున్నారు టేలర్. మహిళల శారీరక సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఉమెన్స్ హెల్త్ యూకే చేసిన విజ్ఞప్తి మేరకు తాను న్యూడ్ ఫోటోషూట్ చేసినట్టు వెల్లడించారు. 

‘నా గురించి తెలిసినవారు నన్నిలా చూస్తే నేను నా కంఫర్ట్ జోన్‌ను దాటుకుని బయటకొచ్చాను అనుకుంటారు. కానీ ఇలా మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించే క్యాంపెయిన్‌లో భాగస్వామిని అయినందుకు గర్విస్తున్నాను’ అని సారా పేర్కొన్నారు. అద్భుతమైన వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలు ఆమె సొంతం. బ్యాటింగ్‌లోనూ సారాకు తిరుగులేదు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో మిథాలీ సేనకు ఓటమి రుచి చూపించారు సారా.