తొమ్మిది నెలల క్రితం ఇద్దరు యువతీ యువకుల మధ్య ఫేస్‌బుక్‌ పరిచయం ప్రేమగా మారింది. ఆ వ్యవహారం పెద్దల దృష్టికి వెళ్లక ముందే కులాంతర వివాహానికి అంగీకరించరేమో అనే ఆందోళన మొదలైంది. ఇరవయ్యేళ్లు కూడా నిండని ఆ యువ జంట రైలు పట్టాలపై నలిగి తనువు చాలించింది. నాలుగు రోజుల కిందట ఒంగోలు శివారు పెళ్లూరు సమీపంలో ఇదే తీరులో జరిగిన ఘటన మరువక ముందే అక్కడికి సమీపంలో మంగళవారం మరో జంట దేహాలు పట్టాలపై ఛిద్రమయ్యాయి. ఎన్నో ఆశలతో బిడ్డలను చదివిస్తున్న రెండు నిరుపేద కుంటుంబాల్లో తీరని శోకం మిగిలింది. ఒంగోలు శివారు కొప్పోలుకు చెందిన భవనం వెంకటేశ్వరరెడ్డి, సుజాత దంపతులు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరి రెండో కుమారుడు విష్ణువర్దన్‌రెడ్డి రైజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కొడుకు స్మార్ట్‌ ఫోన్‌ కావాలని గోల చేస్తుండటంతో మూడు నెలల కిందట సుజాత కష్టం చేసి దాచిన రూ.12 వేలతో కొనిచ్చింది.

ఈ క్రమంలో ఎక్కువ సమయం ఫోన్‌తో సమయం గడుపుతున్న అతడికి ఒంగోలు వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇందు ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. వెలిగండ్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన నాగినేని ఇందు కుటుంబం వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటోంది. ఆమె తండ్రి నాగినేని పుల్లయ్య ఏడాది కిందట మరణించడంతో తల్లి, సోదరుడితో కలిసి ఉంటోంది. స్థానిక శ్రీహర్షిణి డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇంట్లోని ఒక భాగాన్ని అద్దెకు ఇవ్వడంతో వచ్చే కొద్దిపాటి సొమ్ము, తల్లికి వచ్చే పింఛనే ఆ కటుంబానికి జీవనాధారం. కొద్ది రోజుల కిందట ఓ యువతి తన కుమారుడికి తరచూ ఫోన్‌ చేస్తుండటం గమనించిన సుజాత కంగారు పడింది. ఈ వ్యవహారం తల్లికి తెలియడంతో విష్ణువర్దన్‌రెడ్డి ఆ ఫోన్‌ను కాస్తా పగలగొట్టాడు. కానీ స్నేహితుడి మొబైల్‌ నుంచి ఇందుతో టచ్‌లో ఉన్నాడు. సోమవారం రాత్రి ఇంటి సమీపంలోని బడ్డీ కొట్టుకు వెళ్లి పెరుగు పాకెట్‌ తెస్తానని వెళ్లిన ఇందు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియక వెదుకుతున్నారు.