పెళ్లి కూతురు తల్లితో పెళ్లి కొడుకు తండ్రి లేచిపోయిన సంఘటన గుజరాత్‌లోని కటార్గమ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో పెళ్లి వేడుకలను రద్దు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: కటార్గమ్ లో రవి (48) అనే వ్యక్తి టెక్స్‌టైల్ రంగంలో వ్యాపారిగా పని చేసేవాడు. రవి కుమారుడు రాజు, శశికళ (46) (పేర్లు మార్చబడినవి) కూతురు స్మితా ప్రేమించుకోవడంతో వాళ్ల పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారు. ఇద్దరు ఒకే కులానికి చెందిన వారు కావడంతో ఎంగేజ్‌మెంట్ చేసి ఫిబ్రవరి రెండో వారంలో పెళ్లి నిశ్చయించారు. దీంతో ఇరు కుటుంబాలు పెళ్లి కోసం బంధువులకు శుభలేఖలు ఇవ్వడం జరిగింది. పెళ్లి కూతురు, కుమారుడు పెళ్లి పనుల హడావుడిలో మునిగిపోయారు. అనుకోకుండా శశికళ కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు…

అదే సమయంలో పెళ్లి కుమారుడు తండ్రి కనిపించకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కూడా పిఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ జరిపితే ఇద్దరు భువన్‌గర్ జిల్లాలో సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. దీంతో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె తలలు పట్టుకుని కూర్చున్నారు. కాలేజీ రోజుల్లో శశికళ, రవి ప్రేమాయణం కొనసాగించారని వాళ్ల స్నేహితులు తెలిపారు. పెళ్లి వేడుకలను రద్దు చేశారని బంధువులు తెలిపారు. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. భగ్న ప్రేమికులను కలిపిన పెళ్లి కూతురు, కుమారుడు అని క్యాప్షన్స్ పెట్టి కామెంట్లు చేస్తున్నారు. ప్రేమకు మరణం లేదని, అప్పుడు కాకపోతే ఇప్పుడు కలిశారని కామెంట్లు వస్తున్నాయి.