వ్యక్తులపై పనిభారం ఎక్కువయ్యేకొద్దీ వారు అధిక రక్తపోటు బారినపడే ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. ముఖ్యంగా ఆస్పత్రుల్లో పరీక్షలకు చిక్కని (మాస్క్‌డ్‌) అధిక రక్తపోటు వారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నట్లు గుర్తించింది. కెనడాలో కార్యాలయ విధులు నిర్వర్తించే 3,500 మంది ఉద్యోగులపై లవాల్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వారానికి 35 గంటలు పనిచేసేవారితో పోలిస్తే.. 50 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేసేవారు అధిక రక్తపోటు బారినపడే ముప్పు 66 శాతం అధికంగా ఉంటున్నట్లు తేల్చారు.

49 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేసేవారిలో మాస్క్‌డ్‌ అధిక రక్తపోటు అవకాశాలు 70 శాతం పెరుగుతున్నాయని నిర్ధారించారు. 41-48 గంటల మధ్య పనిచేసేవారిలో ఆ ముప్పు 54 శాతం ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. అధిక రక్తపోటు బాధితులు హృదయం-రక్తనాళాల సంబంధిత వ్యాధుల బారినపడే ముప్పు అధికంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రులకు వెళ్లినప్పుడు బయటపడకుండా, వేరేచోట్ల నిర్వహించే పరీక్షల్లో మాత్రం తేలే అధిక రక్తపోటును మాస్క్‌డ్‌ అధిక రక్తపోటుగా పేర్కొంటారు.