టాలీవుడ్ నిర్మాత, వైసీపీ నేత పీవీపీ ఇంట్లో హల్ చల్ చేసిన కేసులో మరో నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ పరారీలో ఉన్నట్టు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. వీరిద్దరి మధ్యా గత రెండేళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘టెంపర్’ సినిమాకు పీవీపీ రూ. 7 కోట్ల ఫైనాన్స్ చేయగా, ఆ డబ్బులను బండ్ల గణేశ్ తిరిగి ఇవ్వలేదు.

గత కొంతకాలంగా డబ్బుకోసం ప్రయత్నించిన పీవీపీ, ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గత రాత్రి పీవీపీ ఇంటిపై దాడి చేసిన బండ్ల గణేశ్, ఆయన అనుచరులు, పీవీపీని, ఆయన కుటుంబీకులను బెదిరించారు. దీంతో, జూబ్లీహిల్స్ పీఎస్ లో పీవీపీ స్వయంగా ఫిర్యాదు చేశారు.

బండ్ల గణేశ్ సహా మరో నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు, వెంటనే ఆయన ఇంటికి, కార్యాలయానికి వెళ్లగా, అక్కడాయన అందుబాటులో లేరు. దీంతో బండ్ల గణేశ్ ఎక్కడున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేక టీమ్ లను నియమించినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.