గ్రామాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా శాశ్వత చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు.రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆమె వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్న మందడి, మంగంపల్లి, గ్రామాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ ఎస్ డి, తెలంగాణకు హరితహారం ప్రత్యేక తెలంగాణ కార్యక్రమం అధికారి ప్రియాంక వర్గీస్ తో కలిసి పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.ముందుగా వీరు చిన్న మందడి గ్రామంలో పర్యటించి ఇంకుడు గుంతలు, గ్రామంలో పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డు, స్మశాన వాటిక లను పరిశీలించారు.

గ్రామంలో హరితహారం కింద నాటిన మొక్కల కు ట్రీ గార్డ్ లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి మొక్కకు ఒక సంఖ్యను ఏర్పాటు చేసి మొక్కల సంరక్షణకు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ అభినందనీయమని ఓ ఎస్ డి ప్రియాంక వర్గీస్ అన్నారు.అనంతరం గ్రామ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ మాట్లాడుతూ చిన్న మందడి గ్రామంలో సర్పంచ్ తో పాటు గ్రామాభివృద్ధికి ఏర్పాటుచేసిన వివిధ కమిటీల పనితీరు అభినందనీయమని, ముఖ్యంగా శానిటేషన్, హరిత కమిటీ, విద్యుత్, మార్కెట్ కమిటీ వంటి కమిటీలు గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలు, హరితహారం కింద పచ్చదనాన్ని పెంచేందుకు తీసుకున్న చర్యలు అభినందించేవిగా ఉన్నాయని అన్నారు.

ఈ సందర్భంగా ఆమె చిన్న మందడి గ్రామం పరిశుభ్రతతో పాటు అన్ని అంశాలలో ప్రగతి సాధించడానికి తీసుకున్న చర్యలను గ్రామ సర్పంచ్ సూర్య చంద్ర రెడ్డి, గ్రామ పంచాయితీ కమిటీల సభ్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.చెత్త సేకరణకు రీక్షాల ను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఇంటికి చెత్త బుట్టలను పంపిణీ చేయడంతో పాటు, రోడ్లపై చెత్త వెయ్యకుండా రోడ్డుకి ఇరుపక్కల చెత్త కుండీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతిరోజు ఉదయం 6:30 కి శానిటేషన్ సిబ్బంది చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారని, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడం తో పాటు, కమ్యూనిటీ ప్లాంటేషన్ చేపట్టడం జరిగిందని, మొక్కలు చనిపోకుండా నీరు పెట్టడంతోపాటు చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవాటిని నాటుతున్న మని పచ్చదనం కమిటీ సభ్యులు వివరించారు. గ్రామపంచాయతీ విద్యుత్ బిల్లు నెలకు 17 వేల రూపాయలు వచ్చిందని తెలుసుకున్న స్మితా సబర్వాల్ మాట్లాడుతూ విద్యుత్తు వినియోగాన్ని ఆదా చేయాలని, అలాగే విద్యుత్ బిల్లు చెల్లించడంలో గ్రామపంచాయతీ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణపై మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు తడి చెత్తను, పొడి చెత్తను వేర్వేరుగా చేయటం చాలా ముఖ్యమని, చెత్త నిర్వహణతో పాటు ఎప్పటికప్పుడు మురికి కాల్వలను, రహదారులను శుభ్రం చేసుకుంటే దోమల శాతం తగ్గుతుందని అన్నారు.

గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా వుంటూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగటం తో పాటు గ్రామం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా శాశ్వత చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ ఎస్ డి, హరితహారం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ హరితహారం కింద ఎన్ని మొక్కలు నాటారు? అని పచ్చదనం కమిటీని ప్రశ్నించారు.4800 మొక్కలు నాటగా 150 మాత్రమే చనిపోయాయని, వాటి స్థానంలో కొత్తవి నాటుతున్న మని తెలిపారు. గ్రామ నర్సరీలో గ్రామస్తులకు అవసరమున్న మొక్కలు పెంచుకోవాలని, ముఖ్యంగా నిమ్మ, తులసి, కరివేప పండ్ల మొక్కల తో పాటు, ఇతర అవసరమైన మొక్కలను పెంచాలని ఆమె సూచించారు. హరితహారం కార్యక్రమానికి అటవీశాఖ అధికారుల సహకారం గురించి అడిగారు. ఈ సంవత్సరం గ్రామంలో 15 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించినట్లు గ్రామ సర్పంచ్ వివరించారు. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కకు ట్యాగ్ వేయడం, వాటిని బతికించేందుకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని మరోసారి అభినందించారు.

పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబుతున్నారని, మధ్యాహ్నం భోజనం ఎలా ఉందని ప్రశ్నించారు.జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఇటీవలే రైతు సంఘ భవనం ప్రారంభించనున్నామని, రైతులు అన్ని రకాల పంటలను పండిస్తున్నారు అని, ముఖ్యంగా కూరగాయలను ఎక్కువగా పండిస్తున్నారు అని, పామాయిల్, వేరుశెనగ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని, మార్కెటింగ్ విషయంలో రైతులకు సహకారం అందించాలని కోరారు.

గ్రామస్తుడు శ్రీనివాస్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రానికి భవనాన్ని మంజూరు చేయాలని, పంట నూర్పిడి కి ఏర్పాటుచేసిన కళ్ళం లో సి సి చేయించాలని, ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు ప్రహరీ నిర్మాణం చేపట్టాలని, ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు.ఈ సందర్భంగా స్మితా సబర్వాల్, ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి లు పాఠశాల విద్యార్థులకు డిక్షనరీ లను పంపిణీ చేశారు.అంతకుముందు జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి స్మితా సబర్వాల్, ప్రియాంక వర్గీయులకు మొక్కలను బహూకరించి స్వాగతం పలికారు. అనంతరం ఇదే మండలం మంగంపల్లి గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని రెండవ విడత కార్యక్రమంలో చేపట్టే కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు.

హరితహారం కింద నాటిన మొక్కలన్నీ ప్రతికూల చర్యలు తీసుకోవాలని ప్రియాంక వర్గీస్ సూచించారు. శానిటేషన్, పచ్చదనం, తదితర కమిటీ సభ్యులతో వీరు మాట్లాడారు. గ్రామానికి రహదారి సౌకర్యం తో పాటు బస్సు సౌకర్యం కల్పించాలని, తండాకు రోడ్డు వేయించాలని కోరగా, ఇలాంటివి చేపట్టేందుకు గ్రామ ప్రణాళికలో ఏర్పాటు చేయాలని, అందుబాటులో ఉన్న నిధుల ఆధారంగా రహదారులు, మురికి కాలువలు వంటివి చేపట్టాలని స్మితా సబర్వాల్ సూచించారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ గణేష్, డి పి ఓ రాజేశ్వరి, ఆర్ డి ఓ కే చంద్రారెడ్డి, జిల్లా అధికారులు, ఎంపీపీ మెగా రెడ్డి, మంగంపల్లి గ్రామ సర్పంచ్ శారద తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్, స్మితా సబర్వాల్ ల గ్రామం వెలుపల ఉన్న నర్సరీని సందర్శించి అక్కడ పెంచుతున్న మొక్కలను, విత్తనాలను సంచులలో మట్టి నింపడం పరిశీలించారు. జనవరి 15 నాటికి మట్టి నింపటం పూర్తిచేయాలని ఆదేశించారు.