అపరిచిత వ్యక్తి అపహరించడంతో తప్పిపోయిన బాలిక పెళ్లయి

ఎప్పుడో చిన్నతనంలో బంధువుల వద్ద ఉండగా అపరిచిత వ్యక్తి అపహరించడంతో తప్పిపోయిన బాలిక పెళ్లయిన తర్వాత భర్త చొరవతో మళ్లీ తల్లిదండ్రుల చెంతకు చేరింది. నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన మంగతాయారు, వెంకటరత్నంల ఏకైక కుమార్తె ప్రసన్న. 2002 డిసెంబరులో తల్లిదండ్రులతో భీమడోలు వెళ్లినపుడు అక్కడ ఆలయంలో ఓ అపరిచిత వ్యక్తి ఆమెను ఎత్తుకుపోయి విశాఖలో కొన్నాళ్లు పెంచుకుని,

తర్వాత అనాథాశ్రమంలో చేర్చాడు. ఆ సమయంలో వీరవాసరం, అనంతపల్లి అనే రెండు చిరునామాలిచ్చాడు. ప్రసన్న ఇంటర్‌ వరకు చదువుకుని, తర్వాత హైదరాబాద్‌కు ఉద్యోగానికి వెళ్లి, అక్కడే నరేందర్‌ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఏడునెలల గర్భిణి. ఆమె తల్లిదండ్రుల వివరాల కోసం నరేందర్‌ తొలుత విశాఖకు, తర్వాత అక్కడినుంచి వీరవాసరం, అనంతపల్లికి వెళ్లారు. అనంతపల్లి గ్రామస్తులు చెప్పిన వివరాలతో ఆమె తల్లిదండ్రులను గుర్తించారు. దొరకదనుకున్న కుమార్తె 18 ఏళ్ల తర్వాత తమవద్దకు రావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.