జమ్మూ- కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒక్కటంటే ఒక్క దేశం కూడా భారత ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడం లేదు. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవాలన్న పాకిస్థాన్ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించడం లేదు. అమెరికా, బ్రిటన్ కేంద్రాలుగా వెలువడే పత్రికలు కాస్త నిరసన తెలిపినప్పటికీ, ఆయా ప్రభుత్వాల నుంచి మాత్రం ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. విశేషం ఏంటంటే, పాకిస్థాన్‌ను వెనకేసుకు వచ్చే చైనా కూడా కిమ్మనడం లేదు. ఎందుకంటే, పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడర్ భవిష్యత్తుపై చైనాకు గుబులు పట్టుకుంది. అందుకే, కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని చైనా వ్యతిరేకించలేకపోతోంది. ఇస్లామిక్ దేశాల కూటమి కూడా పెద్దగా మాట్లాడడం లేదు. కశ్మీర్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేయడం మినహా కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై స్పందించడం లేదు. తాజా పరిణామాలను ప్రపంచదేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. భారత ప్రభుత్వ నిర్ణయంపై అగ్ర దేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి శాంతి, సుస్థిరతలకు భాగస్వామ్య పక్షాలు కృషి చేయాలని అమెరికా సూచించింది. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి చేపడుతున్న చర్యలు పూర్తిగా అంతర్గత వ్యవహారాలని భారత్‌ పేర్కొందని ఈ సందర్భంగా అమెరికా గుర్తు చేసింది. ఐక్యరాజ్యసమితి కూడా కశ్మీర్ వ్యవహారాలపై స్పందించింది. భారత్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై పూర్తి సమాచారం తమకు ఉందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది…