మీడియా స్వేచ్ఛపై లండన్ వేదికగా జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీకి ఊహించని అనుభవం ఎదురైంది. తన ట్విటర్ ఖాతాను స్తంభింప చేయడంపై “ఓ హక్కుల కార్యకర్త ఆయనను తూర్పారబట్టారు”. భావ ప్రకటనా స్వేచ్ఛపై వాడివేడి చర్చ జరుగుతుండగా మైక్ అందుకున్న సదరు కార్యకర్త, పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా మాట్లాడాలనుకునే వారికి ఎదురవుతున్న ఇబ్బందులేంటో తనకు బాగా తెలుసునంటూ ఎద్దేవా చేశారు. ‘‘సోషల్ మీడియాలో నా గొంతు నొక్కేందుకు మీరు ఎవరు?’’ అని ఖురేషీని ప్రశ్నించారు. ఊహించని ఈ ప్రశ్నకు ఖురేషీ స్పందిస్తూ. ‘‘మీ మనోభావాలను గౌరవించాలని మీరు కోరుకుంటున్నారు. అయితే మీరు నాతో మాట్లాడుతున్న తీరు ఎలా ఉందో ఒక్కసారి చూసుకొండి. ఇలా మాట్లాడడం సమంజసమేనా? మీకు ప్రశ్నించే హక్కు తప్పకుండా ఉంటుంది..’’ అని పేర్కొన్నారు.
దీంతో కార్యకర్త మాట్లాడుతూ, ‘‘మరి నన్నెందుకు మీరు సెన్సార్ చేస్తున్నారు? ’’ అని పాక్ మంత్రిని ప్రశ్నించారు. ‘‘నేను అలా చేయలేదు’’ అని ఆయన సమాధానం చెప్పడంతో, ‘‘మీరు ఇలా చెప్పడం సిగ్గుచేటు’’ అంటూ మళ్లీ ఆ కార్యకర్త విరుచుకుపడ్డారు. ట్విటర్ ఖాతా డిలీట్ కావడానికి తాను ఎలా బాధ్యుడిని అవుతానని ఖురేషీ ప్రశ్నించడంతో ‘‘అలా చేసింది మీ పాకిస్తాన్ ప్రభుత్వమే’’ అని ఆ కార్యకర్త పేర్కొన్నారు. అయితే ఆయన ఆరోపణలను కొట్టిపారేసిన ఖురేషీ ‘‘మీరు రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ‘ గ్లోబల్ మీడియా ఫ్రీడమ్ కాన్ఫరెన్స్’ పేరుతో ఈ నెల 10, 11 తేదీల్లో లండన్‌లో తొలి సమావేశం జరిగింది. మీడియా రంగానికి చెందిన అంతర్జాతీయ ప్రముఖులు, జర్నలిస్టులు, పౌర సమాజం, విద్యారంగానికి చెందిన ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు.