{"uid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1625574622932","source":"other","origin":"gallery","sources":["362297483035211"]}

శ్రద్ధా శివాజీ జయభే (28) కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ పుణెలో ఉంటోంది. ఆమెకు వివాహమైంది. ఆమె భర్త ఇండియన్ నేవీలో ఉద్యోగిగా పనిచేస్తూ కేరళలో ఉంటున్నాడు. ఈ దంపతులకు నాలుగేళ్ల పాప ఉంది. శ్రద్ధా తల్లిదండ్రులు, ఆమె మామ అహ్మద్‌నగర్‌లో నివాసముంటున్నారు. పాపను బంధువుల ఇంట్లో ఉంచి శ్రద్ధా రోజూ డ్యూటీకి వెళ్లేది. ఆదివారం రాత్రి కూడా తెలిసిన వాళ్ల ఇంట్లో కూతురిని వదిలి డ్యూటీకి వెళ్లిన శ్రద్ధా ఎప్పుడు తిరిగి ఇంటికి వచ్చిందో తెలియదు. ఇంట్లో ఉరేసుకుని కనిపించింది. పాపను తీసుకెళ్లేందుకు ఉదయాన్నే శ్రద్ధా రాకపోవడంతో ఫోన్ చేశారు. కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వెళ్లి చూడగా లోపల లాక్ చేసి ఉండటాన్ని బంధువులు గమనించారు. తలుపులు బద్ధలు కొట్టి చూడగా ఉరికి వేలాడుతూ శ్రద్ధా విగత జీవిగా కనిపించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు లోనైన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శ్రద్ధా తల్లిదండ్రులకు, భర్తకు ఘటన గురించి తెలియజేశారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య విభేదాల గురించి పోలీసులు ఆరా తీశారు. ఆర్థిక సమస్యలు గానీ మరే ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

శ్రద్ధా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో నాలుగేళ్ల పాప తల్లిని కోల్పోయి అమ్మ ప్రేమకు దూరమైంది. శ్రద్ధా ఆత్మహత్యకు పాల్పడటంతో ఆమె సహోద్యోగులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రద్ధా ఎప్పుడూ చలాకీగా ఉంటూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేదని అలాంటి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం నమ్మశక్యంగా లేదని తోటి ఉద్యోగులు చెప్పారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాక గానీ ఆమె మృతికి సంబంధించిన కారణాలపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.