గ్రామీణ ప్రాంతాలలో కోళ్ల పెంపకం కోసం గతంలో ఉట్టి మీద కుండ బెట్టి అందులో ఇసుక వేసి కోడిని పొదిగిస్తారు. కొందరు గోళ్ళలో పెట్టి పొదగ వేస్తారు. మరికొందరు టెక్నాలజీని ఉపయోగించి అధికంగా కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తారు. ఇలా కాకుండా ఓ విద్యార్థి వినూత్న ప్రయోగం చేసి కోడి పెట్టతో పనిలేకుండానే కోడి పిల్లల ఉత్పత్తి చేశాడు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించాక దాదాపు తొమ్మిది నెలలుగా పాఠశాలలు మూతపడ్డాయి. ఆ సమయంలో బడికి వెళ్లే విద్యార్థులు బయటికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. తమ అభిరుచి మేధాశక్తి మేరకు తనకున్న ఆలోచనలకు అనుగుణంగా కొందరు విద్యార్థులు ఆన్లైన్ క్లాసులపైనా ఆసక్తి చూపించారు.

అయితే నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ అనే చిన్న గ్రామంలో జయంత్ అనే కుర్రాడు, కోడి పెట్ట లేకుండానే గుడ్లను పొదిగించాడు. ఆన్లైన్ ద్వారా సెన్సార్ , 12 డీసీ ఫ్యాన్, ఎర్ర బల్బు తదితర వస్తువులను ఉపయోగించి అట్టపెట్టెలోనే గుడ్లను పొదిగించేశాడు. ఉదయం, సాయంత్రం వేళల్లో 12 గంటలకు ఒకసారి కోడి గుడ్లు తిప్పుతూ అట్టపెట్టెలో ఉష్ణోగ్రత 37.7 డిగ్రీల వరకూ, ఇలా 21 రోజులు తన ప్రయోగాన్ని కొనసాగించాడు. కానీ మొదట్లో కాస్త నిరాశ పరిచినా, పట్టు వదలకుండా మళ్ళీ ప్రయత్నించాడు. రెండవ సారి 30 గుడ్లు తీసుకుని 21 రోజులు తర్వాత అట్ట పెట్టె గుడ్లను పరిశీలించగా గుడ్లు పగిలిపోయి పిల్లలు బయటకు వచ్చాయి. దీనిని బట్టి కోడి పొదగా కుండానే కోడి పిల్లలను పుట్టించ వచ్చని గ్రామస్తులకు తెలియజేశాడు. వాటిని సరైన వెలుతురు తగిన ఉష్ణోగ్రత 33 డిగ్రీలు ఉండే విధంగా 15 రోజులు అట్ట పెట్టెలోనే ఉంచినాడు. ఆ తర్వాత వాటిని గంప కింద వేసి పరిసరాలకు పరిచయం చేశాడు. అయితే ఇలాంటి ప్రయోగం చేయడానికి తనకెంతో వేలలో ఖర్చు కాదని కేవలం 400 మాత్రమే ఖర్చు అవుతుందని, ఇప్పటి వరకు 200 కు పైగా పిల్లలు పుట్టించినట్లు మేకపాటి జయంత్ పేర్కొన్నాడు.