అల్వార్: ఆ యువతి స్వస్థలం ఢిల్లీ. మ్యాట్రిమొనీ సైట్‌లో ఓ యువకుడి ప్రొఫైల్ నచ్చింది. ఆ యువకుడు కూడా యువతిని ఇష్టపడ్డాడు. నాలుగేళ్ల క్రితం పెద్దల సమక్షంలో ఇద్దరికీ పెళ్లి జరిగింది. కానీ, ఆ 32ఏళ్ల యువతి అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అత్తింటి వారు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెబుతుండగా ఆమె భర్త, అత్తింటి వారూ కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వివాహిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కారణం ఏదైనా అత్తింటి ఆరళ్లకు ఓ యువతి నిండు జీవితం బలైపోయింది. గుణవతి, రూపవతి అయిన తమ కూతురిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని ఆ వివాహిత తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లోని అల్వార్‌లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: ఢిల్లీకి చెందిన సుదేష్ గౌతమ్, మీనా కుమార్తె భారతి. ఆమెకు సులభ్ కన్సాల్ అనే యువకుడితో 2017లో వివాహమైంది. మ్యాట్రిమొనీ సైట్‌లో ఒకరి ప్రొఫైల్ మరొకరికి నచ్చి.. అలా ఒకరి గురించి మరొకరు తెలుసుకుని పెద్దల సమక్షంలో భారతి, కన్సాల్ పెళ్లి చేసుకున్నారు.

అన్నీ అబద్ధాలే:

పెళ్లి సమయంలో అబ్బాయి ఆస్తుపాస్తుల గురించి భారతి తల్లిదండ్రులు విచారించారు. తమకు ఆయిల్ మిల్లులున్నాయని సులభ్ కన్సాల్ కుటుంబం భారతి తల్లిదండ్రులను నమ్మించారు. కానీ పెళ్లి తర్వాత వాళ్లకు ఆయిల్ మిల్లులే లేవని తెలిసింది. మోసపోయామని గ్రహించినప్పటికీ కూతురి సంతోషం కోసం ఆ తల్లిదండ్రులు అల్లుడు, అతని కుటుంబం చేసిన మోసాన్ని సహించారు.
మెట్టినిల్లే నరకం:
భారతిని పెళ్లి చేసుకున్న కొన్నాళ్లు ఆమెను ప్రేమగానే చూసుకున్న సులభ్ కన్సాల్ కొన్నాళ్లకు తన అసలు బుద్ధి బయటపెట్టుకున్నాడు. పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలని భారతిని వేధించసాగాడు. రోజూ ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. చాలామంది బంధువుల దగ్గర అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చేందుకు డబ్బు కావాలని పుట్టింటి నుంచి తీసుకురావాలని భారతిని హింసించేవాడు. కట్టుకున్న వాడు పెడుతున్న బాధలను భరిస్తూ వచ్చిన భారతి విసుగెత్తిపోయింది. ఇక తన వల్ల కాదంటూ పుట్టింటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.

తిరిగిరాని లోకాలకు:

ఈ క్రమంలోనే రక్షా బంధన్‌కు ముందు రోజు బట్టలన్నీ సర్దుకున్నానని, రేపు బయల్దేరుతున్నానని తల్లిదండ్రులకు చెప్పింది. అలా చెప్పిన భారతి అదే రోజు రాత్రి అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. భారతికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. భారతి ఆత్మహత్యకు యత్నించిందని. ఆమెను ఆసుపత్రికి తీసుకెళుతున్నామని కన్సాల్, అతని తల్లి భారతి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఆమె తల్లిదండ్రులు అల్వార్‌కు చేరుకునే లోపే భారతి చనిపోయింది. కట్నం కోసం తమ కూతురిని పీడించారని ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులకు భారతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతి భర్తపై, అత్తపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కారణం ఏదైనప్పటికీ మూడేళ్ల చిన్నారి తల్లిని కోల్పోయింది. అత్తింటి ఆరళ్లకు ఓ వివాహిత అన్యాయంగా బలైపోయింది.