ఇస్మార్ శంకర్‌ సినిమాతో తాను హిట్ కొట్టాడు కానీ ఒక్క విషయంలో మాత్రం అలాగే బాకీ పడిపోయాడు పూరీ. అదే తన కొడుకు ఆకాశ్‌కు హిట్ ఇవ్వకపోవడం. భారీ ఆశలు పెట్టుకుని చేసిన మెహబూబా సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఎలాగైనా తనయుడికి హిట్ ఇవ్వాలనే కసితో కనిపిస్తున్నాడు పూరీ జగన్నాథ్.

పూరి జగన్నాధ్ సినిమా అంటేనే మాస్, రొమాంటిక్ సీన్స్ గుర్తుకువస్తాయి. ‘ఇస్మార్ శంకర్’తో చాలా కాలం తర్వాత సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు పూరీ జగన్నాథ్ వేగం పెంచారు. ఇప్పడు పూరి నిర్మాతగా ఆయన కొడుకు ఆకాశ్ హీరోగా రొమాంటిక్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయ తెలిసిందే. ఆకాశ్ కు జోడీగా కేతికా శర్మ ఈ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను పూరీ జగన్నాథ్ విడుదల చేశారు.

పేరుకు తగ్గట్టే ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా రొమాంటిక్ గా ఉంది. యూత్ ను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉండబోతోందనే విషయం ఈ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. ‘రొమాన్స్ అనేది ఎప్పటికీ చాలా ఘాటుగా ఉంటుంది’ అంటూ ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ పాడూరి తెరకెక్కిస్తుండగా పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.