షాదీ.కామ్‌లో పరిచయం అయిన గుర్తుతెలియని వ్యక్తి… పెండ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో ఎనలిస్ట్‌గా పనిచేస్తున్న యువతికి రూ. 2 లక్షలు టోకరా వేశాడు. ఆ యువతి ప్రొఫైల్‌ను చూసి, తాను బెంగళూర్‌లో ఉంటానని, ఎథికల్‌ హ్యాకర్‌నంటూ బాధితురాలితో పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లు మంచిగా మాట్లాడుతూ ఆ తరువాత పెండ్లి ప్రస్తావన తెచ్చాడు. మంచి జీతం వస్తుందని చెప్పగా, ఆ యువతి కూడా పెండ్లికి ఒప్పుకుంది. ఇద్దరు కొన్నాళ్లు చాటింగ్‌ చేస్తూ ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు.

ఈ క్రమంలో తన తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, అత్యవసరంగా డబ్బు అవసరముందంటూ నమ్మిస్తూ ఆమెనుంచి రూ. 2 లక్షలు వసూలు చేశాడు. ఆ తరువాత సెల్‌ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేశాడు. వాట్సాప్‌లో వాకబ్‌ చేసినా స్పందన లేకపోవడంతో మోసపోయానని గుర్తించిన బాధిత యువతి శుక్రవారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇది కోల్‌కతా సైబర్‌నేరగాళ్ల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.