పెట్రోల్ బాటిల్‌తో సీఎం క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేశాడు. మంచిర్యాల పోలీసులు, స్థానిక నేతలు తన సమస్యను పరిష్కరించడం లేదంటూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. శుక్రవారం ప్రగతిభవన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన మంచిర్యాల జిల్లా దండేపల్లి గ్రామానికి చెందిన గుండా రవీందర్ (55)ను సెక్యూరిటీ సిబ్బంది చెక్ చేశారు. అతని బ్యాగ్‌లో పెట్రోల్ బాటిల్‌ను గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.

కేబుల్ టీవీ వివాదంతో :

కేబుల్ నెట్ వర్క్​కు సంబంధించి హైటెక్ సిటీ కేబుల్ యజమాని మౌలానాతో రవీందర్‌కు డబ్బు లావాదేవీల వివాదం ఉంది. దీనిపై దండేపల్లి, లక్సెట్టిపేట్ పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. తన కేబుల్ టీవీ నెట్ వర్క్‌ను స్థానికంగా ఉండే ఓ రౌడీ షీటర్ ఆక్రమించుకున్నాడని పోలీసులకు రవీందర్ ఫిర్యాదు చేశాడు. వాళ్లు పట్టించుకోలేదని, స్థానిక నేతలను ఆశ్రయించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన సమస్యలు ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రగతిభవన్‌కు వచ్చి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని భావించానని పంజాగుట్ట పోలీసులకు రవీందర్ చెప్పాడు.