ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు, వారి ప్రేమను పెద్దలు నిరాకరించారు, అమ్మాయికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. ఇది భరించలేని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. ఇబ్రహీంపట్నంకు చెందిన ప్రణీత్, గుండేటి రమ్య కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు రమ్యకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. దీంతో సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. గ్రామ శివారుకు వెళ్లి పురుగుల మందు తాగారు. తర్వాత ప్రణీత్ చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి భయపడి ఇంటికి వచ్చిన రమ్య అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు యువతని మెట్‌పల్లి ఆస్పత్రికి తరలించగా చికత్స పొందుతూ రమ్య మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.