పెళ్లయిన 20 రోజులకే నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. వరుడు అరెస్టయ్యాడు. వివరాలిలా వున్నాయి, స్థానిక జీఆర్‌ పాళ్యంకు చెందిన మహాదేవమందిరి కుమార్తె చంద్రలేఖ (24)కు కాట్పాడి సమీపం బ్రహ్మపురంకు చెందిన బాలాజీ (34)తో గత నెల 23న వివాహం జరిగింది. మూడ్రోజులు క్రితం భార్యాభర్తలు జీఆర్‌ పాళ్యంకు వచ్చారు. మంగళవారం ఉదయం చంద్రలేఖ ఇంటి మేడపై ఉన్న గదిలో ఒంటిరిగా ఉండగా, కుటుంబ సభ్యులు కింది అంతస్తులో మాట్లాడుకుం టున్నారు. ఆ సమయంలో మేడపై గది నుంచి పెద్దగా కేకలు వినిపించ డంతో భర్త బాలాజీతో పాటు కుటుంబసభ్యులు మేడపైకి చేరుకొని బాత్రూమ్‌ నుండి పొగలు రావడాన్ని గమనించారు.

తలుపులు బద్దలు కొట్టగా, మంటల్లో చిక్కుకున్న చంద్రలేఖ కనిపించింది. వెంటనే ఆమెను అడుక్కుమ్‌పారై ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై న్యాయమూర్తి ప్రభుత్వాస్పత్రికి చేరుకొని చంద్రలేఖ వద్ద మరణ వాంగ్మూలం నమోదు చేశారు. చికిత్సలు ఫలించక ఆమె రాత్రి మృతిచెందింది. ఈ వ్యవహారంపై వేలూరు సబ్‌ కలెక్టర్‌ గణేష్‌ విచారణ జరుపగా, చంద్రలేఖ తల్లిదండ్రులు ఆమె రాసిన ఉత్తరాన్ని ఆయనకు ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలాజీని అరెస్టు చేసి విచారిస్తున్నారు.