కొత్తగా పెళ్లైన వధూవరులు ఫస్ట్ నైట్ రోజున అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ కేసుపై ప్రాథమిక దర్యాప్తు చేసిన పోలీసులు వారిద్దరూ గుండెపోటుతో చనిపోయారని తేల్చారు ఈ ఘటన యూపీలోని గోధియా గ్రామంలో జరిగింది. స్థానిక 24ఏళ్ల ప్రతాప్ యాదవ్ 22ఏళ్ల పుష్ప యాదవ్‌ను మంగళవారం (మే 30, 2023)ను పెళ్లి చేసుకున్నారు. చుట్టాలు, స్నేహితుల మధ్య ఈ పెళ్లి బాగానే జరిగింది. రెండ్రోజుల తర్వాత అంటే, గురువారం (జూన్ 1, 2023) రాత్రి శోభనానికి ఏర్పాట్లు చేశారు. తర్వాత వధూవరులు ఇద్దరూ ఆ గదిలోకి వెళ్లారు. తెల్లారి ఎంతకీ తలుపు తియ్యలేదు కనీసం ఆ గది నుంచి మాటలు కూడా వినిపించట్లేదు.

దాంతో కుటుంబ సభ్యులు తలుపు తట్టారు. ఎంతకీ తియ్యకపోవడంతో బలవంతంగా తలుపులు తెరిచారు. చూస్తే ఇద్దరూ చనిపోయి కనిపించారు. దీంతో వారి మరణాలపై రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై కేసు రాసిన పోలీసులు మృతదేహాలకు పోస్ట్‌మార్టం జరిపించారు. ఆ రిపోర్ట్ తాజాగా వచ్చింది. అందులో వారిద్దరూ గదిలో గాలి సరిగా ఆడకపోవడంతో ఊపిరి అందక గుండెపోటుతో చనిపోయారని తేలింది. దాంతో ఈ కేసులో అనుమానాలేవీ అక్కర్లేదని పోలీసులు తేల్చేశారు.

పెళ్లింట ఆనందం పోయి, విషాదం ఏర్పడింది. పెళ్లికి వచ్చిన బంధువులంతా మళ్లీ ఇప్పుడు అంత్యక్రియలకు వచ్చారు. ఇలా అయ్యిందేంటి అని వారంతా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆ గదిలో గాలి ఆడనంత పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించుకుంటున్నారు. ఈ జంట మరణాలు అందరికీ ప్రశ్నలే మిగుల్చుతున్నాయి.