{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584686019227","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584685973254","source":"other","origin":"unknown"}

ఓ యువకుడు యూట్యూబ్‌లో వీడియో చూస్తూ తన ప్రియురాలికి ప్రసవం చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో శిశువు కడుపులోనే మృతిచెందిన దారుణ ఉదంతమిది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:

తమిళనాడులోని గుమ్మిడిపూండికి చెందిన సౌందర్(27) స్థానికంగా ఓ ప్రైవేటు వంట గ్యాస్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అయితే ఓ కాలేజీ విద్యార్థినిని పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. సదరు యువతికి ప్రెగ్నెసీ సమయంలో వచ్చే శారీరక మార్పులపై తల్లిదండ్రులు పలుమార్లు అడిగినా, మాములు అనారోగ్యమేనని చెబుతూ వచ్చింది. ఇటీవల ఎనిమిది నెలలు నిండాయి. బుధవారం ప్రసవ నొప్పలు రావడంతో సదరు యువతి సౌందర్‌కు ఫోనులో సమాచారం అందించింది. వెంటనే సౌందర్ గుమ్మిడిపూండిలోని ఓ దుకాణానికి వెళ్లి గ్లౌజులు, కత్తెర, బ్లేడు తదితర సామగ్రిని తీసుకున్నాడు.

అనంతరం ద్విచక్ర వాహనంపై కమ్మవారుపాళ్యం సమీపంలోని అడవికి యువతిని తీసుకెళ్లాడు. అక్కడ ఓ చెట్టు కింద యువతిని పడుకోబెట్టాడు. మొబైల్‌లో యూట్యూబ్ వీడియో వీక్షిస్తూ యువతికి ప్రసవం చేసేందుకు ప్రయత్నించాడు. తాను వెంట తెచ్చుకున్న బ్లేడుతో కోయడంతో గర్భసంచిలోని శిశువు చేయి తెగిపోవడంతో యువతి పేగు సైతం తెగి తీవ్రంగా రక్తస్రావమైంది. యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతికష్టం మీద యువతిని పొన్నేరి ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. వైద్యులు యువతిని చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లమని చెప్పారు. అక్కడ శస్ర్త చికిత్స చేసి గర్భంలోని మగ శిశువు మ‌ృతదేహాన్ని వైద్యులు బయటకు తీశారు. యువతి ఆరోగ్య స్థితి ప్రస్తుతం నిలకడగానే ఉండగా, ప్రియుడు సౌందర్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.