చదివింది టెన్త్.. కానీ, అతడి మోసాల చిట్టా అంతాఇంతాకాదు. ఆర్మీ మేజర్‌నంటూ నమ్మబలుకుతాడు. దర్జాగా పెళ్లిచూపులకు వెళ్తూ కట్నానికి వ్యతిరేకినంటూ కలరింగ్ ఇస్తాడు. ఆపై అర్జంట్ అవసరం ఉందంటూ భారీ మొత్తంలో వసూలు చేసేవాడు. ఈవిధంగా దాదాపు 17 మంది నుంచి రూ.8.25 కోట్లు కాజేశాడు. ఇదీ ఎంఎస్ చౌహాన్‌గా చెప్పుకున్న నకిలీ ఆర్మీ మేజర్ ముదావత్ శ్రీను నాయక్ ఘరానా మోసం. ప్రకాశం జిల్లాలోని పలుకురాళ్ల తండాకు చెందిన శ్రీను నాయక్ 2002లో అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమె గుంటూరులోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో సూపరింటెండెంట్. శ్రీనుకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కొన్ని రకాల వైద్యకోర్సులు చేస్తే తేలిగ్గా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని, అందుకు అవసరమైన కోచింగ్ తీసుకోవాలని భార్య సూచించడంతో 2014లో నగరానికి వచ్చి ఉప్పల్‌లో ఓ రూమ్ అద్దెకు తీసుకున్నాడు. ఈ క్రమంలో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. అందుకు అవసరమైన డబ్బు కోసం మోసాలబాట పట్టాడు.
ఆర్మీలోని ఈఎంఈ విభాగంలో మేజర్‌గా పని చేస్తున్నానంటూ చెప్పుకున్న శ్రీను నాయక్ ఆ యూనిఫాంలో దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పెట్టి ప్రచారం చేసుకున్నాడు. ఆర్మీ మేజర్‌నంటూ ఎంఎస్ చౌహాన్ పేరిట నకిలీ గుర్తింపుకార్డును సృష్టించాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేశానని, ఐఐటీ చెన్నై పట్టభద్రుడినని చెప్పుకుంటూ తిరిగేవాడు. వివిధ మ్యాట్రిమోనియల్ సైట్స్, మ్యారేజ్‌బ్యూరోల ద్వారా తమ సామాజిక వర్గానికి చెందిన అవివాహిత యువతుల వివరాలు సేకరించేవాడు. ధనవంతులను టార్గెట్‌గా చేసుకుని ఖరీదైన కారులో పెళ్లిచూపులకు వెళ్లేవాడు. తనకు కట్నకానుకలు వద్దని నమ్మిం చేవాడు. ఆ తర్వాత అర్జంట్ అవసరం వచ్చిందని, ఆదాయపుపన్ను క్లియర్ చేయాలని అందినకాడికి దండుకుని వారికి చిక్కకుండా తప్పించుకునేవాడు.
ఈ ఘరానా మోసగాడు తన భార్యకూ టోకరా వేశాడు. అర్జంటుగా ఐటీ కట్టాల్సి ఉందంటూ ఓసారి రూ.16 లక్షలు తీసుకున్నాడు. పెళ్లి పేరుతో ఎర వేసి ఓ ఎంబీబీఎస్ డాక్టర్ నుంచి రూ.56 లక్షలు, సచివాలయ ఉద్యోగిని నుంచి రూ.52 లక్షలు, పీజీ పూర్తి చేసిన యువతి నుంచి రూ.70 లక్షలు కాజేశాడు. ఇటీవల వరంగల్‌కు చెందిన ఓ ఎంబీఏ పూర్తి చేసిన యువతినీ ఇలానే నమ్మించాడు. ఆమె తండ్రి నుంచి రూ.2.01 కోట్లు కాజేశాడు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యనభ్యసించిన యువతితో శ్రీను నాయక్‌కు ఇటీవల పరిచయం ఏర్పడింది. ఆమె చెన్నై ఐఐటీలో ఇతడి గురించి ఆరా తీయగా అతడు చెప్పేది అబద్ధం అని తేలింది.