కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరంలో వరుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పెళ్లయిన గంటల వ్యవధిలోనే ఈ వార్త తెలియడంతో బంధువులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లా గూడురుకు చెందిన ఓ యువతితో వరుడి సొంత ఇంట్లో వివాహం జరిగింది. కొవిడ్-19 నిబంధనల ప్రకారం పెళ్లి చేసుకునేందుకు మూడు రోజుల ముందు మండల అధికారులకు దరఖాస్తు చేశారు. కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించడంతో కడపలో నమూనాలు సేకరించారు. గురువారం తెల్లవారు జామున వివాహ అనంతరం వధువు, వరుడు గూడురుకు బయలుదేరారు.

ఈ క్రమంలో మూడు రోజుల క్రితం నమూనాలు ఇవ్వగా మధ్యాహ్నం 2 గంటలకు వరుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి ఎం.కవిత తెలిపారు. దీంతో ఈ సమాచారం అందుకున్న పోలీసులు అత్తగారి ఇంట్లో ఉన్న పెళ్లికొడుకొని కడపలోని కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. దీంతో పెళ్లికి హాజరైన బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. వివాహనికి ఏ ప్రాంతం నుంచి ఎంత మంది హాజరయ్యారని పోలీసులు, వైద్య సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 46 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీరికి కూడా పరీక్షలు నిర్వహించనున్నారు.