మరికాసేపట్లో పెళ్లి ! బంధుమిత్ర పరివారంతో ఫంక్షన్‌హాల్‌ మొత్తం కళకళలాడుతోంది. పచ్చటి పందిరి, మేళతాళాలు, అతిథులతో ఆ ప్రాంగణంలో ఎటు చూసినా సందడే. కాసేపట్లో నూతన వధూవరులు పెళ్లి పీఠాలు ఎక్కాల్సి ఉంది. మూడు ముళ్లు, ఏడు అడుగులతో దంపతులై కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. కానీ, ఇంతలో ఏమైంది తెలియదు.

పచ్చగా కళకళలాడుతున్న పెళ్లి ప్రాంగణంలో విషాదం చోటుచేసుకుంది. చక్కగా ముస్తాబై పెళ్లి పీఠాలు ఎక్కాల్సిన వరుడు ఉరిపోసుకున్నాడు. వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన అతడు అంతలో తనువు అర్ధంతరంగా చాలించాడు. ఈ ఘోర విషాద ఘటన షేక్‌బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.

కొంపల్లిలోని ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లి వేడుక నిండుగా జరుగుతుండగానే వరుడు సందీప్‌ అనూహ్యంగా ఉరేసుకొని చనిపోయాడు. వరుడు ఒక్కసారి తనువు చాలించడంతో ఫంక్షన్‌హాల్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. వధూవరుల కుటుంబాలు దిగ్భ్రాంతి చెందాయి. వరుడి కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు…