వివాహం జరిగిన కొద్దిసేపటికే పెళ్లింట విషాద ఘటన చోటుచేసుకుంది. ఎంతో ఆనందంగా జరగాల్సిన పెళ్లి వేడుక ఒక్కసారిగా శోకసంద్రమైంది. పెళ్లి తంతు పూర్తైన కాసేపటికే వరుడి నాయనమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన ఆమె కుమారుడు(వరుడి తండ్రి) కుప్పకూలి మరణించాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం: కొర్రపాడుకు చెందిన వెంకటస్వామి (56) పామిడి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు. శనివారం ఆయన కుమారుడు గోవర్ధన్ వివాహం వైభవంగా జరిగింది.

మరోవైపు, అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటస్వామి తల్లి కోన్నమ్మ (70) మూడు రోజుల క్రితం నుంచి అనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, అప్పటికే పెళ్లి సమయం దగ్గరపడటంతో వివాహం జరిపించారు. ఈ క్రమంలో పెళ్లి ముగిసిన కాసేపటికే తల్లి మరణించిదన్న వార్త తెలిసింది. దీంతో ఒక్కసారిగా షాకైన వెంకటస్వామి కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన బంధువులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. తల్లి, కుమారుడు మరణించడంతో పెళ్లింట విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.