పెళ్లి కుదిరిన నాటి నుంచే కొంత జంటలో ఎన్నో అశలు, ఊహలుంటాయి. పెళ్లైన తర్వాత భర్తకు భార్య, భార్యకు భర్తే సర్వస్వం. ఎప్పుడైన చిన్నచిన్న గొడవలు జరిగితే వారి మధ్యనున్న ప్రేమ ముందు అవి క్షణాల్లోనే సమసిపోతాయి. కానీ ఓ యువతి మాత్రం పెళ్లి కుదిరిన తర్వాత పక్కచూపులు చూసింది. కాబోయే భర్తతో కలిసి షాపింగ్ చేస్తూనే అతడితో వచ్చిన మరో యువకుడిపై మనసుపారేసుకుంది. ఇంతలోనే పెళ్లయింది. ఆ తర్వాత కూడా మారలేదు. సరికదా భర్తను దూరం పెట్టి యువకుడితో వెళ్లిపోయింది. కానీ అంతలోనే ఊహించని పరిణామం ఆమె ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తేః ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం అగ్రహార పంచాయతీ పరిధిలోని రెడ్డివారి పల్లెకు చెందిన నరసుంలు, కృష్ణమ్మ దంపతులకు కుమారుడు అరవింత్, కుమార్తె హర్షిత ఉన్నారు. అరవింద్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా హర్షిత ఓ గోల్డ్ షాపులో సేల్స్ గర్ల్ ఉద్యోగం చేస్తోంది. ఇదిలా ఉంటే హర్షితకు మేలుపట్లకు చెందిన వెంకట రమణారెడ్డి పెంపుడు కుమారుడైన జాషువాతో ళ్లి కుదిరింది. జాషువా ఓ పౌల్ట్రీ పరిశ్రమలో పనిచేస్తుండగా సొంత కుమారుడు రాజేష్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాడు. జాషువాతో హర్షితకు పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి.

ఈ క్రమంలో పెళ్లి షాపింగ్ కోసం కొత్త జంట వెళ్తుండేది. వారితో పాటు రాజేష్ రెడ్డి కూడావెళ్లేవాడు. ఇదే సమయంలో రాజేష్ కు హర్షితతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇంతలోనే ఆమెకు జాషువాతో పెళ్లైంది. ఐతే పెళ్లయినా హర్షిత-రాజేష్ మధ్య బంధం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే రాజేష్ మాయలో పడిన హర్షిత జాషువాను దూరం పెడుతూ వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇంతలోనే రాజేష్ తో క్లోజ్ గా ఉంటుందని తెలుసుకున్న అతడి తల్లి.. హర్షితను మందలించింది. కానీ ఆమె పట్టించుకోలేదు. భర్తకు దూరంగా ఉంటూ తిరిగి ఉద్యోగానికి వెళ్తోంది. ఇదిలా ఉంటే ఈనెల 13న రాజేష్ రెడ్డి ఇంట్లో ఉన్న లక్ష రూపాయలు నగదు, కారు తీసుకొని వెళ్లిపోయాడు. దీంతో కంగారుపడిన తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాజేష్ తీసుకెళ్లిన కారును మదనపల్లెలో గుర్తించారు. కారులోపలి భాగాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు గుర్తించి రాజేష్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే విజయవాడ వెళ్లిన పోలీసులు రాజేష్ తో పాటు హర్షిత కూడా ఉండటం చూసి అవాక్కయ్యారు. ఇద్దర్నీ అదుపులోకి తీసుకొని తిరిగి స్వస్థలానికి తీసుకొస్తుండగా ఒంగోలు వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో హర్షిత స్పాట్లోనే చనిపోయింది. రాజేష్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ జ్ఞానప్రకాష్ కు తీవ్రగాయాలయ్యాయి. పెళ్లి తర్వాత బంధాన్ని గాలికొదిలేసి ప్రియుడితో వెళ్లిన పోయిన కారణంగా ఓ నిండు ప్రాణం బలవడంతో పాటు మరో ఇద్దరు చావుబ్రతుకుల మధ్య ఉన్నారు.