సంతోష్, సిమ్రాన్ ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య’ ప్రేయసి కోసం భార్యను కడతేర్చిన భర్త’ ఇలాంటి వార్తలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నాయి. నిండు జీవితాలను తీస్తున్నాయి. ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నాయి. తాజాగా బీహార్‌లోని సరన్ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ నవ వధువు తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం ఇంటికి తాళం వేసి పారిపోయింది. భగవాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజయాబ్‌గంజ్ స్థానిక ఒకటో వార్డులో ఈ ఘోరం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంః సంతోష్ దాస్ (29) అనే యువకుడి గోపాల్ గంజ్‌ జిల్లాకు చెందిన సిమ్రాన్ కుమార్ (23)కి ఏప్రిల్ 23న వివాహం జరిగింది. తావే ఆలయంలో పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. పెళ్లైన కొన్ని రోజులు పాటు వీరిద్దరు బాగానే ఉన్నారు. ఐతే సిమ్రాన్ ఎప్పుడూ ఫోన్‌ మాట్లాడుతుండడంతో భర్తకు అనుమానం వచ్చింది. వేరొక వ్యక్తితో మాట్లాడుతుందని అనుమానించాడు. ఆమె వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ లొక్కొని బేసిక్ ఫోన్ ఇచ్చాడు. ఇరువురి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఐతే మంగళవారం ఇంట్లో సంతోష్ తప్ప ఎవరూ లేవరు. అందరూ ఇరుగుపొరుగు వారికి పెళ్లికి వెళ్లారు. అదే సమయంలో సిమ్రాన్ ఓ యువకుడిని ఇంటికి పిలిచింది.

తమ బంధువని భర్తకు పరిచయం చేసింది. సిమ్రాన్ నిత్యం తరచూ ఓ వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుండడం బంధువని చెప్పి ఓ యుకువడిని ఇంటికి పిలవడంతో భర్తకు అనుమానం పెరిగింది. ఆమెను నిలదీద్దామనుకునే లోపే ఘోరం జరిగింది. సిమ్రాన్, ఆ యువకుడు కలిసి సంతోష్‌ను చంపేశారు. అనంతరం ఫ్యాన్‌కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులను తీసుకొని ఇంటికి తాళం వేసి పారిపోయింది. మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యులంతా ఇంటికి వెళ్లి చూస్తే తాళం వేసి ఉంది. సంతోష్‌కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు సిమ్రాన్ ఫోన్ స్విచాఫ్ వస్తోంది.

ఏదో జరిగిందని వారిలో అనుమానం కలిగింది. ఇంటి తలుపులను బద్దలు కొట్టి లోపలి వెళ్లి చూస్తే ఫ్యాన్‌కి వేలాడుతూ సంతోష్ శవం కనిపించింది. అందరూ షాక్ అయ్యారు. కుటుంబ సభ్యులంతా సిమ్రాన్‌పైనే అనుమానం వ్యక్తం చేశారు. సిమ్రాన్ ఇంటికి తాళం వేసి వెళ్తుండగా కొందరు స్థానికులు చూశారు. అందువల్లే ఆమే హత్య చేసిందని చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సంతోష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సిమ్రాన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పెళ్లైన నెలరోజుకే భర్తను హత్య చేసిందన్న వార్త స్థానికంగా సంచలనం సృష్టించింది.