వివాహం జరిగి 20 రోజులు కాకుండానే ఓ యువతి తన భర్తను హతమార్చింది. భర్త వేధింపులను భరించలేకే కొత్త పెళ్లి కూతురు ఈ దురాగతానికి పాల్పడింది. టప్పాచబుత్ర పోలీసుల సమాచారం మేరకు: ముజాహెద్‌ నగర్‌కు చెందిన అస్లాం(25)కు జిర్రా మహబూబ్‌ కాలనీకి చెందిన సమ్రిన్‌తో గత నెల 19వ తేదీన పెళ్లి జరిగింది. పెళ్లైన రోజు నుంచే అస్లాం రోజు బాగా తాగివచ్చి రాత్రిపూట భార్యను బండబూతులు తిడుతూ వేధించేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా గొడవ జరిగింది.

శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అస్లాం నిద్రపోతున్నాడు. అదే సమయంలో అతని భార్య సమ్రిన్‌ రోకలితో అస్లాంపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. అస్లాం కేకలు విన్న కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలై ఉన్న అస్లాం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అస్లాం భార్య సమ్రిన్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.