రోజు వేలమంది పేదలకు భోజనం:

భక్తి శ్రద్ధలతో కలియుగ వైకుంఠనాథుడి దర్శనానికి వచ్చే భక్తుల ఆకలి దప్పికలు తీర్చే తితిదే.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సామాజిక సేవలో భాగమైంది. వైరస్‌ వ్యాప్తి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ చేపట్టిన వేళ, ఉపాధి కోల్పోయి తినడానికి తిండిలేక అవస్థలు పడుతున్న పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చింది.

ఈ మేరకు రోజుకు రెండు పూటలా వివిధ ఆహార పదార్థాలను తిరుపతి నగరంలోని కాలనీల్లో పంపిణీ చేస్తోంది. మధ్యాహ్నం 35వేలు, రాత్రి 15వేల అన్నం పొట్లాలను అందిస్తోంది. పెరుగన్నం, సాంబారన్నం, పులిహోర, టమాటో రైస్‌తోపాటు గోధుమరవ్వతో కూడిన ఉప్మాను తయారు చేసి పేదలకు ఉచితంగా అందజేస్తోంది.

నగరంలోని 50 వార్డుల్లో ప్రత్యేకంగా 50 వాహనాలను ఏర్పాటు చేసి ఆహార పదార్థాలను వితరణ చేస్తోంది. ఏప్రిల్‌ 14 వరకు స్వామివారికి కేవలం నిత్య కైంకర్యాలను మాత్రమే నిర్వహిస్తామని, భక్తులను దర్శనానికి అనుమతించబోమని తితిదే ప్రకటించింది. మరోవైపు రెండు కనుమ రహదారులను దేవస్థానం అధికారులు మూసివేశారు. తితిదే సిబ్బంది తిరుమలలో వారం రోజుల పాటు షిఫ్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహించనున్నారు.