ఇంట్లో టీ తాగితే పింగాణి కప్స్, లేదా స్టీల్ గ్లాస్‌లో తాగుతాం. అదే బయటకి వెళ్లినప్పుడు మాత్రం గాజు గ్లాస్‌లు, పేపర్ కప్పులే దిక్కు. అలాంటి సమయాల్లో చాలా మంది పేపర్ కప్పులను ఎంచుకుంటారు. గాజు గ్లాస్‌లు, కప్పులైతే శుభ్రంగా ఉండవని వేరెవరో వాడినవి మనమెందుకు వాడాలని అనుకుంటారు. అందుకే పేపర్ కప్పుల్లోనే టీ, కాఫీ తాగుతుంటారు. ప్లాస్టిక కప్స్ వాడితే పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది. అందుకే ప్రభుత్వాలు ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. కానీ పేపర్ కప్స్ వాడితే ఎలాంటి నష్టం ఉండదు. ఐతే అవి మన శరీరానికి మాత్రం హాని చేస్తాయి. పేపర్ కప్స్ వాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలుసా.? పేపర్ కప్పుల్లో టీ, ఇతర వేడి ద్రావణాలు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఖరగ్‌పూర్‌ ఐఐటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. డిస్పోజబుల్‌ పేపర్‌ కప్పులో మూడుసార్లు 100 మి.లీ. చొప్పున వేడి వేడి టీ తాగడం వల్ల 75 వేల అతి సూక్ష్మ హానికర ప్లాస్టిక్‌ కణాలు శరీరంలోకి వెళ్తాయని పరిశోధకులు వెల్లడించారు.

80-90 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వేడి కలిగిన 100 మి.లీ. ద్రవ పదార్థం ద్వారా 25 వేల మైక్రాన్ల ప్లాస్టిక్‌ కణాలు మనలోకి చేరతాయని తెలిపారు. క్రోమియం, కాడ్మియం వంటి హానికారక లోహాలు శరీరంలోకి వెళ్తాయని పేర్కొన్నారు. రైళ్లలో వెళ్లే వారికి పేపర్ కప్పుల్లోనే టీ ఇస్తుంటారు. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఆ కప్పుల్లో టీ తాగకపోవడమే మంచిది. లేదంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాడితే క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు మృదువైన, తేలికైన ప్లాస్టిక్‌‌లో డెన్సిటీ పాలిథిలిన్‌ ఉండటం వల్ల సాధారణ పరిస్థితుల్లో పేపర్ కప్పుల రీసైక్లింగ్‌ కష్టతరమవుతోంది. ప్రత్యేక పద్ధతులను అనుసరించాల్సి వస్తోంది. అందుకే పేపర్ కప్పులకు బదులు స్టీల్‌ లేదా పింగాణీ లేదా గాజు గ్లాసుల్లో టీ తాగడం మంచిదని సూచిస్తున్నారు. ప్లాస్టిక్‌, పేపర్ కప్పులకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.