ఇంటి పైనుంచి దూకి ఆత్మహత్య

అల్లారుముద్దుగా పెంచుకున్న పన్నెండేళ్ల కుమార్తె హఠాన్మరణాన్ని ఆ తల్లి తట్టు కోలేకపోయింది. అంత్యక్రియలు ముగిసిన మర్నాడే ఇంటి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన గురువారం జరిగింది. సికింద్రాబాద్‌ దూద్‌బావి రోడ్డులోని ఓ అపార్టుమెంట్‌లో కేబుల్‌ ఆపరేటర్‌ మనోహర్‌ కుటుంబంతో నివాసముంటున్నారు. ఆయన కుమార్తె మానస (12) కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. గత ఐదోతేదీన హఠాత్తుగా మరణించింది…

ఆమె అంత్యక్రియలు బుధవారం జరిగాయి. తీవ్ర మానసిక క్షోభకు గురైన తల్లి మంజుల (38) అప్పటినుంచీ కన్నబిడ్డనే తలచుకుంటూ కన్నీరుమున్నీరైంది. తీవ్ర మనోవ్యధతో గురువారం మధ్యాహ్నం అపార్టుమెంట్‌పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకేసింది. గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాత్రంతా బిడ్డను గురించే ఆలోచిస్తూ రోదించిందని, తెల్లవారాక ‘అమ్మా నాకు భయమేస్తోంది రావా ’ అంటూ తన కూతురు పిలుస్తోందంటూ చెప్పిందని కుటుంబీకులు తెలిపారు.